- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలా జరగకపోతే యాక్షన్ తప్పనిసరి.. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కౌన్సెలింగ్
స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. అందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జిల్లా ఇన్‌చార్జి మంత్రులు సన్నద్ధం చేస్తూనే పలు విషయాల్లో కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. అందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జిల్లా ఇన్‌చార్జి మంత్రులు సన్నద్ధం చేస్తూనే పలు విషయాల్లో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నియోజకవర్గంలో మెజార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతో పాటు పంచాయతీల్లోనూ విజయం సాధించాలని స్పష్టం చేస్తున్నారు. అందుకు గ్రామాల వారీగా చేయాల్సిన, చేయకూడని పనులను వివరిస్తున్నారు. సెగ్మెంట్‌లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకుంటే చర్యలు తప్పవనే సంకేతాలు ఇస్తున్నారు. మంగళవారం అసెంబ్లీ స్పెషల్ సెషన్‌కు వచ్చిన ఎమ్మెల్యేలు బుధవారం తమ జిల్లా ఇన్‌చార్జి మంత్రులను కలిశారు. లోకల్ బాడీ ఎన్నికలకు రెడీగా ఉండాలని, ఎలక్షన్స్‌లో గెలిచేందుకు కావాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రులు కౌన్సెలింగ్ ఇచ్చినట్టు టాక్.
సమస్యలు పరిష్కరించుకోండి..
నియోజకవర్గంలోని సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యేలకు ఇన్‌చార్జి మంత్రులు సలహాలు ఇస్తున్నారు. ప్రభుత్వపరంగా చేయాల్సిన పనులు పెండింగ్‌లో ఉంటే వెంటనే అధికారులతో మాట్లాడి వాటిని పూర్తి చేయాలని సూచిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కుదరవని, ఈలోపు వాటన్నింటినీ పూర్తి చేయాలని సూచిస్తున్నారు.
అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలకు ప్రయారిటీ
ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఉంటుందని, గెలిచే వారి పేర్లను మాత్రమే సిపార్సు చేయాలని మంత్రులు సూచిస్తున్నారు. ఆశించిన స్థాయిలో (సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు) గెలవకపోతే అధిష్టానం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని మొఖంపైనే చెబుతున్నట్టు టాక్. ‘ఈ ఎన్నికలు మీ పని తీరుకు పరీక్ష. ఫలితాలు తారుమారైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు టికెట్ ఇవ్వడం కష్టం’ అని ఓ పనికోసం తన వద్దకు వచ్చిన ఎమ్మెల్యేకు ఓ సీనియర్ మంత్రి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు సమాచారం.
ఎన్నికల బాధ్యతలు ఇన్‌చార్జి మంత్రులకు!
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. ప్రభుత్వపరంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందున ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నదనే ధీమాను హస్తం పార్టీ వ్యక్తం చేస్తున్నది. ఇటీవల పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన మంత్రుల సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల ప్రజలు ఫీడ్ బ్యాక్‌తో పాటు విపక్షాల బలాబలాలపై సర్వే సంస్థలు అందించిన రిపోర్టులను ప్రస్తావిస్తూ ఏ జిల్లాలో ఏ వ్యూహాన్ని అమలు చేయాలో చర్చించినట్టు తెలుస్తున్నది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌చార్జిల బాధ్యతలను జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించాలని ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
వచ్చేవారం నోటిఫికేషన్!
వచ్చేవారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవుతుందనే ప్రచారం జరుగుతున్నది. సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టును డెడికేటెడ్ కమిషన్‌కు ప్రభుత్వం అందించింది. బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే విషయంపై కమిషన్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు టాక్. ఆ వర్గానికి ఎక్కడెక్కడ రిజర్వేషన్లు కేటాయించాలనే అంశంపై తుది కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో డెడికేటెడ్ కమిషన్ తన రిపోర్టును ముందుగా హైకోర్టుకు సమర్పించి, ఆ తర్వాత ప్రభుత్వానికి అందజేయనున్నట్టు సమాచారం. ఈ నెల 15లోపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారని ఇప్పటికే రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో జరుగుతున్న హడావుడిని చూస్తున్న సీనియర్ ఐఏఎస్‌లు త్వరలోనే నోటిఫికేషన్ రావొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






