- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Vs MLA's: మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలు..! ఓ జిల్లాలో ‘క్రషర్’ పంచాయితీ
ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి, అదే జిల్లాకు చెందిన నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య కొత్త పంచాయితీ మొదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి, అదే జిల్లాకు చెందిన నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య కొత్త పంచాయితీ మొదలైంది. నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్న కంకర క్రషింగ్ కొన్ని యూనిట్లను కాలుష్య నియంత్రణ విభాగం క్లోజ్ చేయగా, మరి కొన్నింటికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయం మినిస్టర్, శాసనసభ్యుల మధ్య మరోసారి అభిప్రాయబేధాలకు కారణమైంది. తమ అనుమతి లేకుండా ఎందుకు అలా చేస్తున్నారని సదరు ఎమ్మెల్యేలు ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము పనిచేశామంటూ అధికారులు వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఈ వ్యవహారం వెనుక మంత్రి సన్నిహితుల రహస్య ఎజెండా దాగి ఉన్నదని సదరు ఎమ్మెల్యేలు అనుమానిస్తున్నట్టు టాక్. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు ఆ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.
మొదటి నుంచి విభేదాలే
ఆ జిల్లాలో మొదటి నుంచీ మంత్రి, సదరు ఎమ్మెల్యేల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. సమయం వచ్చిన ప్రతిసారీ మంత్రికి చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యేలు ప్లాన్ చేస్తుంటారనే ప్రచారం ఉన్నాయి. గతంలో ఆ మంత్రికి వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవగా.. సీనియర్ల జోక్యంతో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. తాజాగా ఉమ్మడి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా క్రషింగ్ చేస్తున్న ప్లాంట్లకు పొల్యూషన్ బోర్డ్ నోటీసులు ఇచ్చింది. అనుమతులు లేకుండా క్రషింగ్ చేస్తునందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అయితే ఈ వ్యవహారాన్ని తమ నియోజకవర్గాల్లో జోక్యంగా భావించిన సదరు ఎమ్మెల్యేలు.. ఆ మంత్రి ప్రమేయం ఎందుకు? తమకు తెలియకుండా ఎలా నోటీసులు జారీ చేస్తారు? అని రగిలిపోతున్నట్లు తెలిసింది. ఈ ఎపిసోడ్ వెనుక మంత్రి సన్నిహితుల ఆర్థిక ప్రయోజనాలు దాగి ఉన్నాయని, అందుకే నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్యేలు అనుమానిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయొద్దని భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో సీఎంకు ఫిర్యాదు చేసి, ఆ మంత్రి సంగతిని తేల్చుకోవాలనే ప్లాన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగా త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కంప్లయింట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
గులాబీ లీడర్లకు ఎమ్మెల్యేల సపోర్టా?
ఉమ్మడి జిల్లాల్లో మెజార్టీ కంకర క్రషింగ్ యూనిట్లు గులాబీ లీడర్లు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, వారి అనుచరుల చేతుల్లో ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం క్రషింగ్ ప్లాంట్ల జోలికి అధికారులు వెళ్లేందుకు ధైర్యం చేయలేదు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతులు లేకుండా పనిచేస్తున్న క్రషింగ్ యూనిట్లకు పొల్యూషన్ బోర్డ్ నోటీసులు పంపింది. అయితే ఈ నోటీసుల వ్యవహారాన్ని తప్పు పడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్ లీడర్లతో బేరాలు కుదుర్చుకున్నారని, అందుకే వారికి వత్తాసు పలుకుతున్నారని మంత్రి సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తమకు రహస్య ఎజెండా ఏమీ లేదని, కేవలం నిబంధనల మేరకు పనిచేశామని వాదిస్తున్నట్లు తెలిసింది.
మైనింగ్ శాఖ సైతం నోటీసులు జారీ..
రాష్ట్రంలో చాలా ప్లాంట్ల యజమానులు అనుమతులు తీసుకున్న విస్తీర్ణం కన్నా ఎక్కువ ప్రాంతాల్లో క్రషింగ్ చేశారు. దీన్ని గుర్తించిన మైనింగ్ శాఖ ఒక్కో ప్లాంట్‌కు దాదాపు రూ.పది కోట్లకు పైగా ఫైన్ వేసింది. ఆ జాబితాలో ఆ జిల్లాకు చెందిన క్రషింగ్ యూనిట్లు సైతం ఉన్నాయి. మైనింగ్ శాఖ ప్రస్తుతం సీఎం వద్ద ఉంది. ఈ విషయంలో సదరు ఎమ్మెల్యేలు ఎవరిని తప్పుపడుతారు? అని మంత్రి సన్నిహితులు ప్రశ్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.






