ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ)లుగా అప్‌గ్రేడ్‌ చేయడం గొప్ప ముందడుగు అని, ఇది త్వరలోనే ఫలితాలను ఇస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. శనివారం ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో నిర్వహించిన ఏటీసీ ప్రిన్సిపాళ్ల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ)లుగా అప్‌గ్రేడ్‌ చేయడం గొప్ప ముందడుగు అని, ఇది త్వరలోనే ఫలితాలను ఇస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. శనివారం ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో నిర్వహించిన ఏటీసీ ప్రిన్సిపాళ్ల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుద్యోగం పెద్ద సవాలుగా ఉందని, దీనిని అధిగమించాలంటే ఏటీసీలు ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించే దిశగా కృషి చేయాలని సూచించారు. ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం మొదటి ప్రాధాన్యత కావాలని, ఆశించిన ఫలితాలను సాధించేందుకు ప్రిన్సిపాళ్లు అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు.

ఏటీసీలలో ప్రవేశ పెట్టిన కోర్సులు అవసరమైన మార్పులతో మరో 10 నుంచి 15 ఏళ్ల వరకు పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా ఉండాలన్నారు. విద్యార్థులకు లక్ష్యాన్ని నిర్దేశించి వారు విజయం సాధించేలా శిక్షణ ఇవ్వాలని, క్రమశిక్షణ, ఏటీసీల నిర్వహణ అంశాలపై ప్రాధాన్యత ఉండాలని స్పష్టం చేశారు. ఏటీసీల ద్వారా 2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వగలిగితే అదో అద్భుత మైలురాయి అవుతుందని వెల్లడించారు. లక్ష్య సాధన కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని, ఏటీసీల ద్వారా అత్యుత్తమ మానవ వనరులను తీర్చిదిద్దే పెద్ద బాధ్యత ప్రిన్సిపాళ్లు, శిక్షకులపై ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ ఏటీసీలు రాబోయే రెండేళ్లలో 2 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించగలిగితే, అది చాలా గొప్ప విజయం అవుతుందన్నారు.

ముఖ్యమంత్రి చొరవతోనే ఇది సాధ్యమైందని, ఏటీసీలు సత్ఫలితాలను ఇస్తే సీఎస్‌ఆర్‌లో భాగస్వాములైన టాటా టెక్నాలజీ లిమిటెడ్‌ భాగస్వామ్యంతో కలిసి ముందుకు సాగేందుకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. హాజరు శాతం పెంచడం, డ్రాపౌట్స్‌ తగ్గించడంతో పాటు ఏటీసీల పనితీరును క్రమబద్ధీకరించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా సమన్వయంతో ఉండాలని అధికారులను ఆదేశించారు. ఏటీసీల లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేస్తున్న ప్రిన్సిపాళ్లు, శిక్షకులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో కార్మిక, ఉపాధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్, ఉపాధి, శిక్షణ శాఖ జేడీ ఎస్వీకే నాగేశ్, టాటా గ్రూప్ ప్రతినిధులు, ఏటీసీల ప్రిన్సిపాళ్లు, అధికారులు పాల్గొన్నారు.

Next Story