తెలంగాణ గో సంరక్షణ పాలసీపై మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

ప్రకృతి వైపరీత్యాలను ముందుగా జంతువులు పసిగడతాయని, మూగజీవాలకు జరిగే నష్టాన్ని నివారించడానికి మంత్రిగా కాకుండా మానవత్వంతో పని చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

తెలంగాణ గో సంరక్షణ పాలసీపై మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రకృతి వైపరీత్యాలను ముందుగా జంతువులు పసిగడతాయని, మూగజీవాలకు జరిగే నష్టాన్ని నివారించడానికి మంత్రిగా కాకుండా మానవత్వంతో పని చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మూగజీవాల కోసం తెలంగాణ గో సంరక్షణ పేరుతో ప్రభుత్వం పాలసీ తీసుకు రావడం జరిగిందన్నారు. గోశాల నిర్వహణకు విధివిధానాలు రూపొందిస్తున్నామని పైలట్ ప్రాజెక్ట్ గా వేములవాడలో గోశాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గురువారం విపత్తు సమయంలో జంతువులకు జరిగే ప్రమాదాల నివారణపై జరిగిన సదస్సుకు ముఖ్య​అతిథిగా హాజరై ప్రసంగించారు. స్వార్థపూరిత జీవనాలు గడుపుతున్న సమయంలో నోరులేని మూగ జీవాల కోసం పని చేయడం గొప్ప విషయమని, కొంత సహాయం చేసి గొప్పగా చెప్పుకొని సోషల్ మీడియాలో వారంతా చేస్తున్న పని గొప్ప విషయమని కొనియాడారు. గ్లోబల్ వార్మింగ్, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మానవ జాతితో పాటు జంతు జాతి కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో వరదలు, కరువు కాటకాలకు గురయ్యే ప్రాంతం అని ఇలాంటి పరిస్థితుల్లో జంతువులు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 26 లక్షల కుటుంబాలు పశు సంపద పౌల్ట్రీ పరిశ్రమలపై ఆధారంగా జీవిస్తున్నారని, చిన్న, సన్న కారు రైతులకు ఉపాధిని కల్పిస్తూ పశు సంపద కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విపత్తుల సమయంలో జంతువులను కోల్పోవడంతో చాలా కుటుంబాలు తమ ఆధారాన్ని జీవనోపాధిని కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జంతువులను రక్షించడం మనందరి నైతిక బాధ్యత అని, 2024 లో సంభవించిన వరదలతో మనం ఎన్ని పశుపక్షాదులను కోల్పోయామో గుర్తు చేశారు. ఇలాంటి విపత్కర సమయాల్లో జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి శాఖల మధ్య సమన్వయం చాలా అవసరమన్నారు. ప్రభుత్వం పశు వైద్య మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని, మొబైల్ వెటర్నరీ సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు. జంతువుల కోసం పని చేస్తున్న స్వచ్చంద సంస్ధలతో తొందరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో విపత్తుల నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ​గోపి తదితరులు పాల్గొన్నారు.

Next Story