చేప పిల్లల పంపిణీ చేస్తాం - మంత్రి వాకిటి శ్రీహరి

by velandi.Saikiran |   (  Updated:2025-08-14 17:36:45  IST  )

చేప పిల్లల ఉత్పత్తి గణనీయంగా పెంచటమే లక్ష్యంగా ఈ ఏడాది 6 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి ప్రయత్నిస్తుందని వాకిటి

చేప పిల్లల పంపిణీ చేస్తాం - మంత్రి వాకిటి శ్రీహరి
X

ఈ ఏడాది ఆరు లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి టార్గెట్

గతంలో లేని విధంగా ప్రభుత్వం రూ.122 కోట్ల కేటాయింపు

33 జిల్లాలో 26,326 నీటివనరుల్లో 84.62 కోట్ల చేపపిల్లలు పెంపకం

జవాబుదారీ తనంతో కూడిన చేప పిల్లల పంపిణీ చేస్తాం

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులతో చేప పిల్లలు చనిపోయే ప్రమాదం

కోహెడలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హోల్ సేల్ మార్కెట్

రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడి

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో చేప పిల్లల ఉత్పత్తి గణనీయంగా పెంచటమే లక్ష్యంగా ఈ ఏడాది 6 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి చేసే దిశగా మత్స్య శాఖ ప్రయత్నిస్తుందని రాష్ట్ర పశుసంవర్థక,మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గురువారం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి మంత్రి వర్గంలో ప్రభుత్వం చేపల పెంపకానికి, మత్స్యకారుల జీవనోపాధి కల్పించే విధంగా మత్స్యశాఖ అభివృద్ధికి చర్యలు తీసుకుందన్నారు. 33 జిల్లాల్లోని 26,326 చెరువుల్లో రూ. 93.62 కోట్లతో 84.62 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను ఎంపిక చేసిన 300 చెరువుల్లో రూ. 28.60 కోట్ల వ్యయంతో వంద శాతం గ్రాంటుతో ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంతకం మత్స్యకారులకు రూ. 1.34 కోట్ల ప్రమాద భీమా పథకంపై చేసినట్లు తెలిపారు. టెండర్ పక్రియ త్వరలోనే ఉంటుందని, చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో ప్రత్యక్షంగా 4.21 లక్షల మత్స్యకారులతో పాటు పరోక్షంగా 10 లక్షల మందికి జీవనోపాధి లభిస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా కోహేడలో రూ. 47.03 కోట్లతో అత్యాధునిక ఎగుమతి ప్రదాన చేపల హోల్​సెల్​మార్కెట్​నిర్మాణం, అదే విధంగా రంగారెడ్డి జిల్లా శెరిగూడ, నిజామాబాద్​జిల్లా ఆర్సపల్లి ప్రాంతాల్లో రూ. 2 కోట్లతో ఆధునిక చేపల హోల్ సేల్ మార్కెట్ల నిర్మాణం చేపట్టపోతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మహిళా సాధికారతలో భాగంగా సెర్ప్ సహకారంతో మహిళా సంఘాలకు వంటకాల తయారీ,మార్కెటింగ్ ఎలా చేయాలి శిక్షణా ఇచ్చి 35 మొబైల్ చేపల రిటైల్ అవుట్లెట్ అందించామన్నారు. గత 10 ఏళ్లలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో అనేక అవకతవకలు జరిగాయని వీటిపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని, ఇక నుంచి అక్రమాలకు తావులేకుండా చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా జరిగేలా 6 అధికారులు,మత్స్య కారులు సంఘాల అధ్యక్షుడు,సభ్యులతో కూడిన కమిటీ పర్యవేక్షణలో 80 మిల్లిమీటర్ నుండి 100 మిల్లిమీటర్ సైజ్ చేప పిల్లల పంపిణీ జరుగుతుందన్నారు. ఈ కమిటీ నిరంతరం చేప పిల్లల ఎదుగుదలను పర్యవేక్షిస్తుందన్నారు. చేప పరిమాణం,ఎన్ని చేపలు,ఆ ప్రాంత సంఘం,షికం పరిణామం ఎంత,సంఘం అధ్యక్షుడు మొబైల్ నెంబర్ కనిపించే విధంగా చెరువుల వద్ద బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

గత ప్రభుత్వం మత్స్య సంపద పెరగకుండా కుట్రలు :

గత బీఆర్​ఎస్​ప్రభుత్వం 10 ఏళ్లుగా 30 చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. రూ. 24 కోట్లతో అన్ని కాలాల్లో నీటి సౌకర్యం ఉన్న చోట ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. తెలంగాణ చేప కొర్రమీను కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కరీంనగర్ లో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. రూ.100 కోట్ల బకాయిల పై విజిలెన్స్ విచారణ ఎంక్వయిరీ జరుగుతుందని, కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు. సహజంగా చేప పిల్లలు పెరుగుతాయని కేవలం కోర్రమీను జాతి చేపలకు మాత్రమే ఫీడ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. రిజర్వాయర్లో, చెరువుల్లో, సీజనల్ చెరువుల్లో ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్దారణ చేసిన తరువాత పంపిణీ ఉంటుంది, ఎలాంటి తప్పులకి తావు ఉండకుండా కమిటీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను చెరువులో నిమర్జనం చేయడంతో చేప పిల్లలు చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story