- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఎదగాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా కొనసాగాలంటే పరిశోధనను బలోపేతం చేసి, ఎగుమతులను విస్తరించి, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌లోని హోటల్ దస్పల్లా లో సీడ్స్‌మెన్ అసోసియేషన్ 30వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన హైదరాబాద్ సీడ్ కాన్‌క్లేవ్ -2025లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా కొనసాగాలంటే పరిశోధనను బలోపేతం చేసి, ఎగుమతులను విస్తరించి, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌లోని హోటల్ దస్పల్లా లో సీడ్స్‌మెన్ అసోసియేషన్ 30వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన హైదరాబాద్ సీడ్ కాన్‌క్లేవ్ -2025లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సీడ్ కంపెనీలు దేశ నిర్మాతలు అని వారికి రాష్ట్ర ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. వ్యవసాయంలో నాణ్యమైన విత్తనం అత్యంత ముఖ్యమైన ఇన్‌పుట్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. విత్తనం దిగుబడిని నిర్ణయిస్తుందని, ఎరువులు నీటి పారుదల సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపారు. వ్యవసాయంలో విత్తనాలు చాలా ముఖ్యమని వీటి వల్లనే అధిక దిగుబడుల ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయన్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ప్రశంసిస్తూ, రోజూ వ్యవసాయం చేసే రాజకీయ నాయకుడిగా ఆయన ప్రత్యేకమైన వ్యక్తి అని ఉత్తమ్ అభివర్ణించారు. రైతుల కష్టాలను బాగా అర్థం చేసుకుంటారని తుమ్మలను కొనియాడారు.
డిసెంబర్ 2023 నుంచి ప్రతి ఖరీఫ్, రబీ సీజన్‌లో తెలంగాణ రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించిందని ఉత్తమ్ అన్నారు. తుమ్మల నాయకత్వంలో తెలంగాణ దేశంలో నంబర్ వన్ వరి ఉత్పత్తి రాష్ట్రంగా అవతరించిందని స్పష్టం చేశారు. సీడ్ కంపెనీలు పరిశోధన, అభివృద్ధిపై మరింత దృష్టి సారించాలని, ముఖ్యంగా అధిక దిగుబడి ఇచ్చే కొత్త వరి రకాలను అభివృద్ధి చేయాలని పిలుపు నిచ్చారు. అన్ని పంటలలోనూ ఆవిష్కరణలు జరగాలి. అదే రైతుల ఆదాయాన్ని పెంచే మార్గమని పేర్కొన్నారు. తెలంగాణ సీడ్ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో విస్తరిస్తోందని తెలిపారు. ఫిలిప్పీన్స్‌కు ఇప్పటికే విత్తనాలు, బియ్యం ఎగుమతి చేస్తున్నామని, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, బుర్కినా ఫాసో, ఇతర ఆఫ్రికన్ దేశాలకు కూడా ఎగుమతుల ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్ వివరించారు. విత్తనాల ఎగుమతికి గొప్ప అవకాశాలు ఉన్నాయి. మన సాఫ్ట్‌వేర్ పరిశ్రమ తెలంగాణ పేరు ప్రపంచానికి చేర్చినట్లే, మన సీడ్ పరిశ్రమ కూడా సరిహద్దులు దాటి రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిపెట్టగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. సీడ్ తయారీ కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. గతంలో వ్యవసాయ విశ్వ విద్యాలయాలు మాత్రమే మెరుగైన రకాల విత్తనాలకు మూలమని గుర్తు చేశారు. డిమాండ్ పెరిగిన తరువాత ప్రైవేట్ సీడ్ కంపెనీలు స్థాపించబడి, పరిశోధన, హైబ్రిడ్ అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టాయన్నారు.
* 1995లో సీడ్స్‌మెన్ అసోసియేషన్ నమోదు
ప్రభుత్వంతో సమన్వయం చేసుకునేందుకు హైదరాబాద్‌లో 1995లో సీడ్స్‌మెన్ అసోసియేషన్ నమోదు చేయబడింది. చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ సంఘం ప్రస్తుతం 505 మంది సభ్యులతో ఉంది. ఇందులో సీడ్ కంపెనీలు, అసోసియేట్ సభ్యులు, గౌరవ సభ్యులు ఉన్నారు. రెండేళ్ల పదవీ కాలానికి ఎన్నికయ్యే ఎగ్జిక్యూటివ్ కమిటీ విధాన మార్గ దర్శకత్వం వహిస్తుంది, క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తుంది. సభ్య సంస్థలు ప్రతి సంవత్సరం రూ.90 లక్షల నుంచి రూ. కోటి వరకు వ్యవసాయ విశ్వ విద్యాలయాలకు బ్రీడర్ సీడ్ సరఫరా కోసం చెల్లిస్తున్నాయి. దీని ద్వారా పత్తి, మొక్కజొన్న, వరి, పొద్దు తిరుగుడు, కూర గాయలలో వాణిజ్య హైబ్రిడ్ల ఉత్పత్తి సాధ్యమవుతోంది. ఈ సంఘం నోడల్ ఏజెన్సీగా కూడా పనిచేస్తుంది. బ్రీడర్ సీడ్ సరఫరా, నియంత్రణ నిబంధనల అనుసరణ, క్రమానుగత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయాలు, విత్తన ధృవీకరణ సంస్థ, నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో సమన్వయం చేస్తుంది. ఈ కార్యకలాపాలు విత్తన ఉత్పత్తి, సరఫరాలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో సీడ్ కంపెనీలు, పరిశోధనా సంస్థలు, రైతు ప్రతినిధులు, ఎమ్మెల్యే కె. సత్యనారాయణ, అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఎన్.వి. రామకృష్ణతో తదితరులు కూడా పాల్గొన్నారు.






