Uttham kumar Reddy : రక్షణశాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ భేటీ

by Muthe.Rajitha |   (  Updated:2025-06-11 15:51:29  IST  )

ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham kumar Reddy) రక్షణశాఖ అధికారులతో భేటీ అయ్యారు.

Uttham kumar Reddy : రక్షణశాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham kumar Reddy) రక్షణశాఖ అధికారులతో భేటీ అయ్యారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగంలో ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌కు సహకారం కోరుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు రక్షణ శాఖ అధికారులను కలిశారు. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఈ సొరంగంలో టన్నెల్ బోరింగ్ మెషీన్ (TBM) పనుల సమయంలో ఆకస్మిక వరద, మట్టి, బురద కారణంగా సొరంగం కొంత భాగం కూలిపోవడంతో 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. అందులో ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు మాత్రమే బయట పడగా మిగిలిన ఆరుగురి గురించి ఇంకా తెలియలేదు. ఈ ప్రమాదం ఫిబ్రవరిలో సంభవించినప్పటికీ, రెస్క్యూ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా ఈ ఆపరేషన్‌ను వేగవంతం చేయడానికి అదనపు సహాయం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రక్షణశాఖతో సంప్రదింపులు జరిపారు.

శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం పనులు పునరుద్ధరణకు సిద్ధం అవుతున్నామని.. మిగిలిన 9 కి.మీ పనులు వచ్చే రెండేళ్లలో పూర్తిచేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రంగా ఉన్నందున హెలికాప్టర్ సర్వే చేసి.. తదుపరి పనులు మొదలు పెట్టాలని చూస్తున్నామని వెల్లడించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. బుధవారం రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులతో జరిగిన భేటీలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ నుంచి ఎస్ఎల్‌బీసీ సొరంగం పూర్తి చేయడానికి సహకారం ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. ఈ మేరకు వారు సైతం అంగీకరించారని చెప్పారు. ఆర్మీలో ఉన్న కల్నల్ పరీక్షిత్ మెహరా, సరిహద్దు రోడ్డు సంస్థ మాజీ డీజీ జనరల్ హర్పాల్ సింగ్‌ను తెలంగాణకు డిప్యుటేషన్‌పై పంపేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు.

రోహతాంగ్, సీలా సొరంగాలు నిర్మించడంలో ఈ ఇద్దరు అధికారులు నిష్ణాతులని.. అందుకే పరీక్షిత్ మెహరాను ప్రత్యేక కార్యదర్శిగా.. జనరల్ హర్పాల్ సింగ్‌ని గౌరవ సలహాదారుగా తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ ఇద్దరి సహకారంతో రాష్ట్రంలో చేపట్టిన అన్ని సొరంగాలు నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ మేరకు డెన్మార్క్ నుంచి అత్యాధునిక ఎలక్ట్రో మాగ్నాటిక్ సర్వే పరికరాలు తెప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సర్వే వల్ల సొరంగం వాస్తవ పరిస్థితి తెలుసుకోవచ్చని.. హెలికాప్టర్‌కి లైడార్ కూడా ఏర్పాటు చేసి ఆ సర్వే కూడా చేస్తామని చెప్పారు. వైమానిక దళ హెలికాప్టర్లు, పవన్ హన్స్ హెలికాప్టర్ల సాయం కూడా ఆడిగినట్లు చెప్పారు. ఎన్జీఆర్ఐ ఎక్స్‌పర్ట్ ప్రొఫెసర్ తివారీ, అలాగే.. ధన్బాద్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ సహకారం తీసుకుంటామని అన్నారు. వీరి వద్ద ఉన్న అత్యంత అధునాతన టన్నెల్ టెక్నాలజీ వినియోగిస్తామని తెలిపారు.

9 కిలోమీటర్లు పెండింగ్..

ఎస్ఎల్‌బీసీలో ఇంకా 9 కిలోమీటర్లు పెండింగ్‌లో ఉందని.. దానిని పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వచ్చేనెల 12 నుంచి ఈ సర్వే ప్రారంభం అవుతుందని.. వారం రోజుల్లో పూర్తి చేస్తారని చెప్పారు. డెన్మార్క్ నుంచి వచ్చే సర్వే పరికరాలన్నీ అద్దెకు తీసుకోనున్నామని తెలిపారు. ప్రమాదంలో ఉన్న టీబీఎం ఇక పనికిరాదని చెప్పారు. శ్రీశైలం నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీటి సరఫరా కోసం ఈ సొరంగం తవ్వుతున్నట్లు తెలిపారు. మధ్యలో గాలికూడా చొరబడకుండా సొరంగం నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. టన్నెల్ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం అందించినట్లు చెప్పారు.

Next Story