- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ హయాంలో రూ.1.81 లక్షల కోట్లు వృథా
నీటిపారుదల శాఖలో గత బీఆర్‌ఎస్ పాలనలో విపరీతమైన అవకతవకలు జరిగాయని, రూ.1.81 లక్షల కోట్లు వెచ్చించినా కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలమైందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: నీటిపారుదల శాఖలో గత బీఆర్‌ఎస్ పాలనలో విపరీతమైన అవకతవకలు జరిగాయని, రూ.1.81 లక్షల కోట్లు వెచ్చించినా కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలమైందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 103 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం నిరుపయోగంగా ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకుంది. తెలంగాణకు హక్కుగా ఉన్న కృష్ణా బేసిన్ వాటాను కోల్పోయాం. కేసీఆర్ పాలనలో అవినీతి, దుర్వినియోగంతో రైతులు నష్టపోయారు’ అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను పూర్తిచేయడంలో విఫలం కావడంతో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా చేజారిపోయిందని పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్‌ల నుంచి నీటి లభ్యత ఉన్నా, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు సగంలో నిలిచిపోవడంతో సరిపడా నీటిని నిల్వ చేసుకోలేకపోయిందని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో సాగునీటి విషయంలో సీరియస్‌గా ఉండి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదని మండిపడ్డారు. రూ.1.81 లక్షల కోట్లు ఎక్కడికి పోయింది? రిజర్వాయర్లు ఎందుకు అసంపూర్తిగా ఉన్నాయి? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నష్టాన్ని శుభ్రం చేసి ఫలితాలను అందజేస్తుందని హామీ ఇచ్చారు. గత పాలనలో అతిపెద్ద వైఫల్యాలలో పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (PRLIS) ఉందని తెలిపారు. అంజనగిరి, వీర్నంపల్లి, వెంకటాద్రి, కురుమూర్తిరాయ, ఉదండాపూర్, కేపీ లక్ష్మీదేవిపల్లి పోతిరెడ్డిపల్లి, సింగరాజ్‌పల్లి, గొట్టిముకల, ఇర్విన్, యర్రాపల్లి-గోకవరం, డిండి, చింతపల్లి, కిస్తారంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, శివన్నగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు, బీఆర్‌ఎస్ వైఫల్యాల వల్ల ఏర్పడిన సాగునీటి సంక్షోభానికి ముగింపు పలికేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో నిర్లక్ష్యం వల్ల తెలంగాణకు రావాల్సిన కృష్ణా బేసిన్ వాటా వృథా అయిందని, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత లేదని సూచించారు. అవినీతి, మోసాల రోజులు పోయాయని.. బీఆర్‌ఎస్ హయాంలో ధ్వంసమైన వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్ర రైతాంగానికి అన్యాయం జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి తెలిపారు.
దక్షిణ తెలంగాణకు కరువు తెచ్చారు..
నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ సొరంగం ద్వారా నిండే రిజర్వాయర్స్ కెపాసిటీ 10 టీఎంసీలు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ రిజర్వాయర్స్ కెపాసిటీ 25 టీఎంసీలు, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రిజర్వాయర్స్ కెపాసిటీ 65 టీఎంసీలు అని.. ఈ మూడు ప్రాజెక్టులే కాకుండా కృష్ణా బేసిన్‌లోని వివిధ దశలలో ఉన్న ఇతర ప్రాజెక్టులకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టించుకోలేదని తెలిపారు. ఫలితంగా దక్షిణ తెలంగాణలో కరువు పరిస్థితులు వచ్చాయని ఆరోపించారు. గత పదేళ్లుగా వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణ కూడా చేయకుండా నిర్లక్ష్యం చేసింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. కృష్ణా బేసిన్‌లోని కొన్ని ప్రాజెక్ట్‌లలో కాలువలు, డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాణం అసంపూర్తిగా ఉన్న విషయం వాస్తవం కాదా? అని పేర్కొన్నారు. బేసిన్‌లోని సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడానికి కేసీఆర్, హరీశ్‌రావు ప్రధాన కారణమని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే మూడు సంవత్సరాలలో కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లన్నింటినీ పూర్తిచేస్తామని తెలిపారు.






