- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధాన్యం సేకరణపై సహకరించాలి.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీకి మంత్రి ఉత్తమ్ లేఖ
రాష్ట్రంలో ఖరీఫ్ లో ధాన్యం సేకరణ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా కొనసాగేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీకి లేఖ రాశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఖరీఫ్ లో ధాన్యం సేకరణ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా కొనసాగేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి లేఖ రాశారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ.. పౌరసరఫరాల శాఖకు సంబంధించిన కీలక ఆపరేషనల్, ఆర్థిక సమస్యలపై కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరమని పేర్కొన్నారు. రబీ 2024–25 సీజన్‌కు అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల ఉడికించిన బియ్యం లక్ష్యాన్ని కేటాయించాలని, ఖరీఫ్ 2024–25కు సంబంధించి సీఆర్‌ఎంఆర్ డెలివరీ గడువును 2026 జనవరి 31 వరకు పొడిగించాలని కోరారు. గత ఏడాదితో పోలిస్తే రేక్స్కొరత కారణంగా ఎఫ్‌సీఐ గోదాముల్లో ఉడికించిన బియ్యం నిల్వలు పెరిగాయని, వాటి తరలింపుకు అదనపు రేకులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఖరీఫ్ 2025–26 లో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిన నేపథ్యంలో కేంద్రం నిర్దేశించిన సేకరణ లక్ష్యం సరిపోవడం లేదని, రైతులు నష్టపోకుండా ఉండాలంటే సేకరణ లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి 54 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పెంచాలని సూచించారు. అదే విధంగా రాష్ట్రంలో నిల్వ సామర్థ్యం పెంచేందుకు అదనంగా 15 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించేందుకు కేంద్ర పథకాల కింద మంజూరు చేయాలని తెలిపారు. గత సంవత్సరాల పెండింగ్ సబ్సిడీల విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు.
2014–15లో అధిక మిల్ లెవీ బియ్యానికి సంబంధించి రూ.1,468 కోట్ల సబ్సిడీ విడుదల చేయాలని, అలాగే 2022 ఏప్రిల్‌లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పంపిణీ చేసిన 89,988 మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించిన రూ.343.27 కోట్ల సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ అంశాలపై త్వరితగతిన అనుకూల నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రంలో ధాన్యం సేకరణ సజావుగా సాగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ఆర్థిక భారం కూడా తగ్గుతుందని తెలిపారు.






