- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వదిలిపెట్టం.. సాధించి తీరుతాం: మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
కృష్ణా జలాల విషయం(Krishna Water Dispute)లో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జలాల విషయం(Krishna Water Dispute)లో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన నీటివాటలో ఒక్క చుక్క నీరు కుడా వదులుకునే ప్రసక్తేలేదని ఆయన తేల్చిచెప్పారు. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దేశరాజధాని ఢిల్లీలో జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్(Tribunal) విచారణలో తాను స్వయంగా పాల్గొనబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీలో 23 నుండి 25 వరకు జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2 విచారణలో తెలంగాణ ప్రభుత్వం అనుసరించాల్సిన అంశంపై శనివారం ఆయన కార్యాలయంలో న్యాయనిపుణులు, నీటిపారుదల రంగ నిపుణులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఇదే అంశంపై ఒత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఢిల్లీకి చేరుకుని సమీక్షిస్తారని ఆయన వెల్లడించారు. కృష్ణా జలాశయాలలో తెలంగాణ వాటాను సాధించేందుకు బలమైన వాదనలు వినిపించేందుకు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని వారు ఇచ్చే నివేదికల ఆధారంగా న్యాయవాదులు రాష్ట్రానికి చెందాల్సిన నీటివాటపై వాదనలు వినిపించనున్నారని ఆయన పేర్కొన్నారు. KWDT ఎదుట 2025 ఫిబ్రవరి నుండి వాదనలు కొనసాగుతున్నాయని, సమైక్యాంధ్రలో తెలంగాణా ప్రాంతానికి జరిగిన అన్యాయంపై ప్రస్తావించారని ఆయన తెలిపారు. శాస్త్రీయంగా నీటి కేటాయింపులు, ఆంద్రప్రదేశ్ చేపట్టిన అనధికార బేసిన్‌ల వివరాలు, తెలంగాణా ప్రాంతంలో సాగునీటి అవసరాలు అందులో పొందు పరచరన్నారు.
ఎప్పటికప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కాలువల సామర్ధ్యాలను పెంచుకుంటూ గోదావరి, పట్టిసీమ, చింతలపూడి, పులిచింతల నీరు అక్రమంగా తరలించుకుపోతున్న అంశాలను ఇప్పటికే ట్రిబ్యునల్ ముందు ఉంచామన్నారు. 1956 జలవివాద చట్టం,2014 ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిన విషయంపై వాదనలు వినిపించామన్నారు. 811 టీఎంసీల కృష్ణా జలాశయాలలో తెలంగాణా ప్రాంతానికి 71 శాతం కేటాయింపులు ఉండాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇక్కడ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు 65% కేటాయింపులు ఉండాల్సిందేనన్నారు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లుగా నీటి కేటాయింపులు ఉండాలని అందుకు అనుగుణంగా తాజా సమాచారాన్ని ట్రిబ్యునల్‌కు సమర్పించామని ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని జారవిడుచుకోబోమని ఆయన పునరుద్ఘాటించారు.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా వినియోగిస్తున్న 291 టీఎంసీల నీటి ఉదంతం వెలుగులోకి వచ్చినందున ఆ నీటిని పునర్విభజన చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్, నదుల నిర్వహణ బోర్డుల ఎదుట ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులపై అడ్డుపడుతుండడంతో ఒకింత ఆలస్యం జరుగుతోందని ప్రాజెక్ట్‌ల నిర్మాణాలపై తెలంగాణాకు ఉన్న హక్కులను కుడా ట్రిబ్యునల్ ఎదుట జరిగే వాదనలలో వినిపిస్తామన్నారు. తమ వాదనలకు బలం చేకూరేలా ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణాల అంశాలతో కూడిన ప్రత్యేక జీ.ఓ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సన్నదమౌతుందన్నారు. వీటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు,పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకాల సామర్ధ్యం పెంపుతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం తాగునీటి అవసరాల కోసం కొత్తగా నిర్మిస్తున్న రిజర్వాయర్‌లు,100 టీఎంసీలను మళ్లించడానికి వీలుగా రూపకల్పన చేసిన జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్‌లు ఉన్నాయన్నారు.
ఇప్పటివరకు తెలంగాణా ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తి చేయక పోవడం వల్లనే కృష్ణా జలాశయాలను తెలంగాణా వినియోగించుకో లేకపోయిందని ఆయన బీఆర్ఎస్ పాలకులపై మండిపడ్డారు. గత పాలకుల ఉదాసీనతతోటే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకునిపోయి ప్రయోజనం పొందిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుక్షణం నుండే న్యాయంగా తెలంగాణాకు రావాల్సిన నీటి వాటాపై గట్టిపట్టు పడుతున్నామన్నారు. అందుకు తగిన ప్రణాళికలు రూపొందించి ముందుకు పోతున్నామన్నారు. తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని ట్రిబ్యునల్ ఇప్పటికే గుర్తించిందని తెలంగాణాకు దక్కాల్సిన నీటి వాటా కేటాయింపులను ఎట్టి పరిస్థితుల్లో సాధించి తీరుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.






