- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుంభకోణానికి ఆస్కారమే లేదు..ల్యాండ్ పాలసీ పై అసత్య ప్రచారాలు.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీపై ప్రతిపక్ష నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీపై ప్రతిపక్ష నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, హైదరాబాద్ నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ చేయాలన్న పాలసీ లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పాలసీలో ఎలాంటి కుంభకోణానికి ఆస్కారమే లేదని, మేము తెచ్చిన విధానం అత్యంత పారదర్శకమైన పాలసీ అని ఆయన అన్నారు. గురువారం గాంధీ భవన్ నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఇండస్ట్రీలను అవుటర్ రింగ్ రోడ్డు బయటకు పంపాలన్న డిమాండ్ ఉందని ఇది కొత్త డిమాండ్ కాదని అన్నారు. ఇది మేం కొత్తగా తెచ్చిన పాలసీ కాదు.. గతంలో కూడా ఈ పాలసీ ఉంది.. కానీ, ఇది మేము కొత్తగా తెచ్చిన పాలసీ లాగా ప్రతిపక్ష పార్టీలు గొడవ చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ పాలసీ పై చర్చ జరిగిందని, తాము అధికారంలోకి వస్తే ఈ విధానాన్ని మారుస్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు.. పాలసీ మార్చేది లేదు అని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మేము తెచ్చిన పాలసీ అర్థం కాలేదని వారు పాలసీని పూర్తిగా అర్థం చేసుకోవాలని సూచించారు.
ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని, అవినీతి జరగలేదని వారికి కూడా తెలుసు.. కానీ, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులతో ప్రజల్లో స్పందన వస్తుండడంతో తట్టుకోలేక ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇండస్ట్రియల్ పాలసీ రూపకల్పనలో తాను భాగంగా ఉన్నానని, కొత్త ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీతో రాష్ట్రానికి అదనపు ఆదాయం వస్తుందని ఆయన అన్నారు. నల్గొండ డీసీసీ నియామకంపై స్పందించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరాకరించారు. పార్టీ ఇంటర్నల్ విషయాలను బయట మాట్లాడనని ఆయన స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం పవర్ ప్రాజెక్టు పెద్ద కుంభకోణం..
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన భద్రాద్రి కొత్తగూడెం పవర్ ప్రాజెక్టు పెద్ద కుంభకోణం అని, గత ప్రభుత్వం ఇండియా బుల్ అనే కంపెనీ దగ్గర ఉపయోగంలో లేని పరికరాలు కొనుగోలు చేసి సబ్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని నిర్మించారని, ఇది ఎందుకు ఉపయోగించలేని పరిస్థితిలో ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం విద్యుత్ ప్రాజెక్టు అవుట్ డేటెడ్ టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఏముందని, భద్రాద్రి ప్రాజెక్టు అనవసరంగా తెలంగాణ ప్రజలపై రుద్దిన ప్రాజెక్టు అని ఆయన దుయ్యబట్టారు. విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో 50 వేల కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోందని, రూ.50 వేల కోట్లు కాదు రూ.50 వేల రూపాయల కుంభకోణం కూడా జరగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
గాంధీ భవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం
గాంధీ భవన్ లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని, ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అనేక సమస్యలు, ఫిర్యాదులను ప్రజలు ఉత్తమ్ దృష్టికి తీసుకురాగా, దానికి ఆయన అధికారులతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.






