సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట.. ‘పుర’ ఫలితాలపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

పార్లమెంటు ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట,కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్లు భారతదేశ చరిత్రలోనే ప్రత్యేక రికార్డుగా నమోదు అయిందని గుర్తు చేశారు.

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట.. ‘పుర’ ఫలితాలపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సన్న బియ్యం పంపిణీ ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారిందని, మున్సిపల్​ఎన్నికల్లో సాధించిన విజయాలు రేవంత్ ​సర్కార్ ​పనితీరును ప్రతిబింబింప చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, అమలు అవుతున్న సంక్షేమ పథకాలకు ప్రజామోదం లభించిందన్నారు. శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ అర్హులైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డుల పంపిణీతో పాటు రాష్ట్ర జనాభాలో 85 శాతం ప్రజలకు ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇందిరమ్మ ఇళ్లు, ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ సరఫరా వంటి పథకాలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేశాయన్నారు. సాగునీటి రంగంలో సాధించిన విజయాలు,యావత్ భారతదేశం చరిత్రలోనే రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. అదే స్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియతో పాటు రైతాంగానికి అనుకూలంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాయన్నారు. ఈ ఫలితాలు తాము ముందుగా ఊహించినవేనని,యావత్ తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తోందనడానికి ఈ ఎన్నికల అద్దం పడుతున్నాయన్నారు.

భారతదేశ చరిత్రలోనే ప్రత్యేక రికార్డు

పల్లెలతో పాటు పట్టణాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై ప్రజలిచ్చిన తీర్పుగా అభివర్ణించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలోని హుజూర్ ​నగర్, నేరేడుచర్లతో పాటు కోదాడ, సూర్యాపేట మున్సిపాలిటీ పలితాలతో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని మరోసారి రుజువైందన్నారు. ఈ విజయం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో సాధించిందని అందుకు తోడ్పాటునందించిన మున్సిపాలిటీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 2023 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సాధించిన సంచలన విజయాల వరవడి ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాజాగా జరిగిన పురపాలక సంఘాల ఎన్నికల్లోనూ కొనసాగిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట,కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్లు భారతదేశ చరిత్రలోనే ప్రత్యేక రికార్డుగా నమోదు అయిందని గుర్తు చేశారు. తాజాగా మున్సిపల్​పోరు ఫలితాలు మరోసారి సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదని నిరూపించారని హర్షం వ్యక్తం చేశారు.

Next Story