uttam: బనకచర్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేపు ఆల్ పార్టీ ఎంపీలకు పీపీటీ

by Prasad Jukanti |   (  Updated:2025-06-17 09:45:34  IST  )

బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

uttam: బనకచర్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేపు ఆల్ పార్టీ ఎంపీలకు పీపీటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి-బనకచర్ల (Banakacharla) లింక్ ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుపై అన్ని పార్టీల లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో రేపు సాయంత్రం 4 గంటలకు నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) బనకచర్లపై పీపీటీ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తోపాటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు లేఖలు పంపి స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి ఆహ్వానించారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అయినా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుండటం, అందుకు బీజేపీ సహకరిస్తోందనే ప్రచారం జరుగుతున్న వేళ ఈ పీపీటీలో పాల్గొనే ఎంపీల అభిప్రాయాలు, సూచనలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఈ ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

బనకచర్లపై తీవ్ర అభ్యంతరం

గోదావరి బంకచర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంటూ తాను 22 జనవరి 2025న కేంద్ర ఆర్థిక మరియు జలశక్తి మంత్రులకు లేఖలు రాసిన విషాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వాన పత్రికతో పాటు వివరంచారు. ఈ ప్రాజెక్టు విషయంలో అభ్యంతరాలను తెలుపుతూ జూన్ 3న సీఎం రేవంత్ రెడ్డి, తాను కలిసి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కు విషయాన్ని వివరించామన్నారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని తదుపరి చర్యలు తీసుకునేందుకు రేపు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంతక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ని గౌరవ అథితులుగా ఆహ్వానిస్తు వారి విలువైన సూచనలు కోరుతున్నట్లు ఉత్తమ్ తన ఆహ్వానంలో పేర్కొన్నారు.

తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు సానుకూలం: రామానాయుడు

తెలంగాణ ప్రాజెక్టులకు అప్పుడు ఇప్పుడు సీఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో ఇవాళ ఆయన బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో తగిన మదింపు లేకుండా ఎగువన ప్రాజెక్టులు కడితే నష్టపోయేది ఏపీ రైతులేనన్నారు. దిగువ పరివాహక ప్రాంతాల ప్రత్యేక హక్కులు గురించి మాత్రమే చంద్రబాబు మాట్లాడారని పేర్కొన్నారు. అంతే తప్ప తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలనే ప్రయత్నం కాదన్నారు. గతంలో సీతమ్మ బ్యారేజీ, సీతారాం సాగర్ లిఫ్టును కూడా తాము వ్యతిరేకించ లేదన్నారు. గోదావరి నుంచి ఇతర రివర్ బేసిన్ లకు నీటిని తరలించే హక్కు చట్టం ప్రకారం తమకు ఉందని స్పష్టం చేశారు. ఆ చట్టం ప్రకారమే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని, ఏపీలోనూ తాము బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తేల్చి చెప్పారు.

Next Story