‘డిండి’ని వేగంగా పూర్తి చేయండి: మంత్రి ఉత్తమ్‌

by Gantepaka Srikanth |

డిండి ఎత్తిపోతల పథకం ఆఫ్ టెక్ పాయింట్‌కు సంబంధించిన లెవల్ ఫిక్సేషన్ తక్షణమే చేపట్టి ప్రాజెక్టును వేగవంతంగా పూర్తిచేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

‘డిండి’ని వేగంగా పూర్తి చేయండి: మంత్రి ఉత్తమ్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిండి ఎత్తిపోతల పథకం ఆఫ్ టెక్ పాయింట్‌కు సంబంధించిన లెవల్ ఫిక్సేషన్ తక్షణమే చేపట్టి ప్రాజెక్టును వేగవంతంగా పూర్తిచేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. డిండి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై గురువారం సెక్రెటేరియట్‌లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఏదుళ్ల రిజర్వాయర్ నుండి ఎత్తిపోతల స్కీమ్ అప్రోచ్ చానల్‌కు నీటిని ఏ స్థాయిలో తీసుకురావాలనే అంశంపై తుదినిర్ణయం తీసుకోవాలని సూచించారు. పోతిరెడ్డిపల్లి గ్రామంలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ బ్యారేజ్ పనులను ఈ నెల 15 నాటికి ఆర్థిక సంబంధిత అనుమతులు తీసుకుని వెంటనే ప్రారంభించాలన్నారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు గేట్ల ఏర్పాటు కోసం వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు సంబంధించిన పనుల్లో ప్రభుత్వం ఇప్పటివరకు 95 శాతం పనులు పూర్తి చేసిందని ఆయన చెప్పారు. ఇందులో అధిక భాగం ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సాధించిన పురోగతేనని మంత్రి తెలిపారు. మూడు గ్రామాల పునరావాస సమస్యలు, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 180.14 హెక్టార్ల అటవీ భూమికి సంబంధించిన సమస్యల కారణంగా స్పిల్‌వేలో ఒక భాగం ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్నారు. ఈ అటవీ భూమికి సంబంధించిన తొలి దశ అటవీ అనుమతులు మరో నెల రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నదని ఆశాభావం వ్యక్తం చేశారు.

6వేల క్యూసెక్కులకు కాల్వల సామర్థ్యం..

ఎస్‌ఎల్‌బీసీ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2,400 క్యూసెక్కుల నుంచి 4,000 క్యూసెక్కులకు పెంచాల్సిన అవసరాన్ని మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అనంతరం సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులను చేపట్టాలని ఆయన సూచించారు. అలాగే.. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ సామర్థ్యాన్ని 6వేల క్యూసెక్కులకు మరింత పెంచాల్సిన అవసరం ఉండొచ్చని పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ హైలెవల్ కాలువకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనుల కోసం ప్రభుత్వం రూ.443 కోట్లు మంజూరు చేసిందన్నారు. అయితే.. లైనింగ్ పనుల కంటే ముందుగా కాలువ విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 228 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలను కవర్ చేస్తూ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నీటి సమస్యలకు పరిష్కారం లభించనుందని ఆయన తెలిపారు. అదేవిధంగా 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. ఈ పథకం కింద మొత్తం 25.31 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నాలుగు ఆన్‌లైన్ రిజర్వాయర్లు, ఐదు ఆఫ్‌లైన్ రిజర్వాయర్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన హెడ్‌వర్క్స్‌ను నాలుగు ప్యాకేజీలుగా విభజించగా, అందులో పోతిరెడ్డిపల్లి గ్రామంలోని బ్యారేజ్, 16 కిలోమీటర్ల టన్నెల్ కూడా ఉన్నాయన్నారు. పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి చేసేందుకు సవరించిన అంచనాల తయారీ పురోగతిని సైతం ఉత్తమ్ సమీక్షించారు. దీనిని హై పవర్డ్ కమిటీ ముందు ఉంచాలని అభిప్రాయపడ్డారు. తదుపరి మంత్రివర్గం సమావేశంలో దీనిని ప్రవేశపెట్టేందుకు నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ.శ్రీధర్, జాయింట్ సెక్రెటరీ కే.శ్రీనివాస్, ఈఎన్సీ రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Next Story