- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాగునీటి ఇబ్బందులు రానివ్వద్దు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వనరుల సంరక్షణ, రబీ పంటల రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వనరుల సంరక్షణ, రబీ పంటల రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. రబీ సీజన్ చివరి దశలో ఉన్న పంటలకు చివరి వరకూ నీరందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆదివారం మంత్రి ఉన్నతాధికారులతో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న నీటిని వినియోగించడంతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన, మధ్య తరహా ప్రాజెక్టులు, చెరువుల్లో సమగ్ర డీసిల్టేషన్, డీసెడిమెంటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. లభ్యమయ్యే నీటిని సమర్థంగా వినియోగించడంలో చీఫ్ ఇంజినీర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆదేశించారు. నిల్వ ఉన్న పంటలు ఎండిపోకుండా కాపాడటం, తాగునీటి అవసరాలకు తగిన నిల్వలను సంరక్షించడం రెండు ప్రధాన ప్రాధాన్యతలుగా తీసుకోవాలని పేర్కొన్నారు. అధికారులు స్వయంగా ముందుండి పరిస్థితులను అంచనా వేసి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని 6.30 లక్షల ఎకరాల ఆయకట్టులో ఇప్పటికే రబీ సీజన్‌లో పంటలకు సాగునీరు అందించామని అధికారులు తెలిపారు. కోతలు పూర్తయిన ప్రాంతాలను మినహాయించి ఇంకా తడి అవసరమైన పంటలకు తప్పనిసరిగా నీరు అందించాలని మంత్రి ఆదేశించారు. కాల్వలు మూసే ముందు తాగునీటి అవసరాల కోసం చెరువులు, ట్యాంకులు పూర్తిగా నింపాలని అధికారులను ఆదేశించారు.
జూరాల ప్రాజెక్టు మరమ్మతులకు వేగం
జూరాల ప్రాజెక్టు మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1.66 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, నారాయణపూర్ నుంచి పునరుత్పత్తి నీటిగా 0.5 టీఎంసీలు చేరే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. ప్రవాహాలు ఆలస్యమైతే 0.5 టీఎంసీల లోటు ఏర్పడే అవకాశం ఉన్నదని చెప్పారు. గతేడాది కర్ణాటక నుంచి ఒక టీఎంసీ నీటిని సమీకరించిన విషయాన్ని అధికారులు గుర్తుచేశారు. జూరాల వంతెన నిర్మాణ స్థలాన్ని ఖరారు చేయాలని మంత్రి ఆదేశించారు. వంతెనతోపాటు చిన్న బ్యారేజ్ నిర్మాణానికి అనుకూలంగా సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు.. రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో డీసిల్టేషన్ చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. చెరువులు, ప్రాజెక్టులపై ప్రాథమిక సాధ్యత నివేదికలు వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల్లో 30-40 శాతం వరకు మట్టి పేరుకుపోయినట్లు సర్వేలు చెబుతున్నాయని, నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు శాస్త్రీయ పద్ధతిలో డీసిల్టేషన్ చేయాలని మంత్రి పేర్కొన్నారు. అలాగే.. పెద్ద పంప్‌హౌస్‌లను నిరంతరంగా నడపాలని, తరచూ ఆన్-ఆఫ్ చేయడం వల్ల యంత్రాలకు నష్టం కలిగే అవకాశం ఉన్నదని మంత్రి తెలిపారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై సీడబ్ల్యూపీఆర్ఎస్ నిర్వహిస్తున్న అధ్యయనాల పురోగతిని మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో సాగునీటి శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్, టన్నెల్ ఇంజినీరింగ్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు, వివిధ ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.






