- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమ్మక్క–సారలమ్మ ప్రాజెక్టు: అధికారులకు మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు
ఎన్‌డీఎస్ఏ నివేదిక ప్రకారం కాళేశ్వరం బ్యారేజీలను పునరుద్ధించనున్నట్లు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్‌డీఎస్ఏ నివేదిక ప్రకారం కాళేశ్వరం బ్యారేజీలను పునరుద్ధించనున్నట్లు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. అలాగే.. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల పనుల పూర్తిచేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. సెక్రెటేరియట్‌లోని తన ఛాంబర్‌లో మంగళవారం మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రంవంతి ప్రాజెక్టు, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, కాళేశ్వరం కింద మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉన్నాయని తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో తుమ్మిడిహెట్టి భాగాన్ని మొదటి అంశంగా తీసుకుంటూ, ఇంజినీరింగ్ బృందాలు రెండు ప్రత్యామ్నాయ కాలువ మార్గాలను పరిశీలిస్తున్నాయని, ఏ మార్గాన్ని ఎంచుకోవాలనే అక్టోబర్ 22 నాటికి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మైలారం నుండి 71.5 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ, 14 కిలోమీటర్ల సొరంగం ద్వారా సుందిళ్లకు నీరు తరలిస్తామన్నారు. మరోమార్గం ప్రకారం మధ్యలో పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఎల్లంపల్లి ద్వారా నీటిని మళ్లించడం జరుగుతుందన్నారు. ఈ రెండు ప్రత్యామ్నాయాలు ఖర్చు, హైడ్రాలిక్ సామర్థ్యం, భౌగోళిక అనుకూలత, విద్యుత్ అవసరాలపై సమీక్షించినట్లు తెలిపారు.
2027 నాటికి ఎస్ఎల్‌బీసీని పూర్తిచేస్తాం
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ ప్రాజెక్టును డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. భూగర్భ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ తెలంగాణ నీటి పారుదల నిర్మాణంలో కీలక భాగమని, ఇది శ్రీశైలం జలాశయాన్ని కరవు ప్రాంతాలతో అనుసంధానిస్తూ 43 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ ద్వారా వేల ఎకరాల వ్యవసాయ భూములకు కృష్ణా నదీ జలాలను అందించడానికి రూపొందించబడిందని చెప్పారు. సాంకేతిక, పరిపాలనా అడ్డంకులను తొలగిస్తున్నామని, ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఉన్నత స్థాయి పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కింద మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ప్రకారం జరుగుతోందని తెలిపారు. ప్రముఖ ఐఐటీ ప్రధాన సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించే అవకాశం ఉందని, ఇది తెలంగాణ నీటి పారుదల శాఖకు చెందిన చీఫ్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ)తో కలిసి పని చేస్తుందని వివరించారు. ప్రధాన ఐఐటీ బృందం నిర్మాణ రూపకల్పన, పరీక్షలు, పునరుద్ధరణ ప్రణాళికను చేపడుతుందని.. వర్షాకాలానికి ముందు పరీక్షలు పూర్తయ్యాయని.. వర్షాకాలం అనంతరం పూర్తి పునరుద్ధరణ రూపకల్పన ఒక సంవత్సరంలో పూర్తవుతుందని చెప్పారు. వారానికి ఒకసారి పురోగతి సమీక్షలు నిర్వహించి సాంకేతిక ఫలితాలను పద్ధతిగా నమోదు చేయాలని ఆదేశించారు.
సమ్మక్క సాగర్‌పై సమీక్ష
న్యాయ పరమైన అంశాల పరంగా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II (కేడబ్ల్యూడీటీ-II) ముందు జరుగుతున్న విచారణల పురోగతిని మంత్రి సమీక్షించారు. సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ తెలంగాణ వాదనలు ముగించారని, ఆంధ్రప్రదేశ్ తమ సమర్పణలను ప్రారంభించిందని తెలిపారు. ప్రతి సమావేశానికి సంబంధించిన సవివరమైన నివేదికలను సిద్ధం చేయాలని, ఢిల్లీలోని న్యాయ బృందంతో, రాష్ట్ర సుప్రీంకోర్టు న్యాయవాదులతో సమన్వయం సాధించాలని, వాదనల్లో ఏకరూపత ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే.. సమ్మక్క–సారలమ్మ ప్రాజెక్టు పురోగతిని పైనా సమీక్షించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెంట్రల్ వాటర్ కమిషన్‌ను సంప్రదించిందని.. నీటి కేటాయింపు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం కోరిందని తెలిపారు. ఈ ప్రక్రియ చురుకుగా కొనసాగుతున్నట్లు తెలిపారు. సీతమ్మసాగర్, మొడికుంటవాగు, చనక–కోరటా పంపిణీ వ్యవస్థలు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుల పెట్టుబడి ఆమోద దరఖాస్తులు ఢిల్లీలో సమర్పించామని.. వాటి సమీక్ష ప్రధాన్ మంత్రి కృషి సించాయీ యోజన (పీఎంకేఎస్‌వై) పరిధిలో తుది దశకు చేరుకుందని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు శాఖ ప్రధాన ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో ఒకటని అన్నారు. ప్యాకేజీ-6, అదనపు మూడో దశ ప్యాకేజీలకు ఆమోదం లభించిందని తెలిపారు. భూ సేకరణ పరిహారంగా రూ.33 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ఆదేశించి, అన్ని సవరించిన అంచనాలను (ఆర్‌ఈలు) ఈ నెలలోనే ఆమోదించాలని సూచించారు. దేవదుల ప్రాజెక్టు గణనీయమైన భౌతిక పురోగతి సాధించిందని, త్వరలోనే భూస్థాయి ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. డిండి ప్రాజెక్టుపై సమగ్ర సమీక్షా నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. భౌతిక పురోగతి, నిధుల వినియోగం, పెండింగ్ పనులు ఉండాలని ఆదేశించారు. ఈ నివేదిక మూడు రోజులలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. నీటి పారుదల రిజర్వాయర్ల మట్టిని తొలగించడం, అవక్షేపాలను తొలగించడంపై ముసాయిదా విధానాన్ని సమీక్షించారు. ఇంటర్-స్టేట్ వాటర్ రిసోర్సెస్ (ఐఎస్‌డబ్ల్యూఆర్డ్), చీఫ్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) బలోపేతం సమర్థవంతమైన రూపకల్పన, పర్యవేక్షణకు అత్యవసరమని అన్నారు. అలాగే వర్షాకాలం తగ్గుముఖం పట్టడంతో అన్ని ప్రధాన రిజర్వాయర్లు నిండుగా ఉంచాలని, హైడ్రాలజికల్ సీజన్ ముగిసే వరకు టెలీమెట్రీ ఆధారిత పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.






