- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Uttam Kumar Reddy: ప్రాజెక్టుల వద్ద 24 గంటలు పహారా పెట్టండి
రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు సంభవించే ప్రమాదం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు రౌండ్ ది క్లాక్ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు సంభవించే ప్రమాదం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు రౌండ్ ది క్లాక్ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నాగార్జునసాగర్, జూరాల, కడెంతో సహా ప్రధాన ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. రానున్న 72 గంటలలో ప్రతి నిమిషం ఎంతో విలువైనదని.. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ విధుల్లో ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రాజెక్టుల వద్ద 24 గంటలు పహారా పెట్టాలన్నారు. కాల్వకట్టలు తేగిపోయే పరిస్థితులు ఉంటే గుర్తించి ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన నిధులు కోసం జీఓ 45 ప్రకారం వినియోగించుకోవాలన్నారు. పాలనాపరమైన అనుమతుల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
అలాగే.. నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయం చేసుకుంటూ విపత్తులు సంభవించకుండా చర్యలు చేపట్టాలన్నారు. విపత్తు సమయంలో ప్రతి నిమిషం విలువైనదని, ఇటువంటి సమయంలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. శాఖలో పనిచేస్తున్న అన్ని విభాగాల వారికి సెలవులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. లష్కర్ నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ విధి నిర్వహణలో ఉండాలన్నారు. ఎవ్వరూ సెలవులలో ఉండకూడదని.. కాలువలు, చెరువులు, ప్రాజెక్టులు అన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని సూచించారు. నిండిన చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కాలువలకు, చెరువులకు ఎక్కడైనా గండ్లు పడితే నష్టాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లకు, నీటి పారుదల ఉన్నతాధికారులకు నిరంతరం సమాచారం అందించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, జాయింట్ సెక్రెటరీ కే.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






