- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మీటింగ్‌కు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టిని తీసుకొస్తా: మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా కొనుగోలు, విక్రయాల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా కొనుగోలు, విక్రయాల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను బట్టి ఆయా రకాల వరి పంటలను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో తెలంగాణ బియ్యానికి ఉన్న గుర్తింపును మరింత బలోపేతం చేసి ఎగుమతులు పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర బియ్యం దిగుమతి చేసుకుంటున్న దేశాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఉత్పత్తికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కొనుగోళ్లు పెంచాలని మంత్రి డిమాండ్ చేశారు. కేంద్రం నిర్దేశించిన 50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని రాష్ట్రం ఇప్పటికే అధిగమించిందని, తాజా ఖరీఫ్ సీజన్‌లోనే 72 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే..
ధాన్యం కొనుగోళ్లు, సన్నాలకు బోనస్, నిల్వపై వడ్డీ చెల్లింపులు కలిపి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.25,000 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 2025-26 నాటికి 160 మిలియన్ మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోందని, అందులో తెలంగాణ వాటా సుమారు 10–11 శాతం ఉంటుందని తెలిపారు. బియ్యం ఎగుమతులపై కేంద్రం విధించిన నిషేధం ఎత్తివేత తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు గణనీయంగా పడిపోయినట్లు మంత్రి పేర్కొన్నారు. బ్రోకెన్ రైస్ టన్ను ధర 650 డాలర్ల నుంచి 350 డాలర్లకు తగ్గిందన్నారు. ఇప్పటివరకు ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ప్రస్తుతం వియత్నాం మీద ఆధారపడి బియ్యం దిగుమతి చేసుకుంటున్న ఫిలిప్పీన్స్ తెలంగాణ బియ్యం కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రతి సంవత్సరం సుమారు 3 మిలియన్ టన్నుల బియ్యం దిగుమతి చేసుకునే నైజీరియా వంటి దేశాలు కూడా ఆశాజనక మార్కెట్లుగా కనిపిస్తున్నాయని చెప్పారు. సంబంధిత దేశాల్లో వినియోగించే బియ్యం రకాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి, ఆయా రకాల పంటలను రాష్ట్రంలో ప్రోత్సహించేలా రైతాంగానికి మార్గదర్శకాలు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో పాటు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.






