‘మీ తప్పుడు నిర్ణయాలు, కక్కుర్తి వల్లే తెలంగాణకు ఈ దుస్థితి’.. హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ కుమార్ ఫైర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-07 16:18:29  IST  )

కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ గుండెకాయ అని చెబుతున్నారని.. ఆ బ్యారేజీ ఐదేళ్లలో కేవలం 162 టీఎంసీలే ఎత్తిపోశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

‘మీ తప్పుడు నిర్ణయాలు, కక్కుర్తి వల్లే తెలంగాణకు ఈ దుస్థితి’.. హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ కుమార్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ గుండెకాయ అని చెబుతున్నారని.. ఆ బ్యారేజీ ఐదేళ్లలో కేవలం 162 టీఎంసీలే ఎత్తిపోశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత టి.హరీశ్‌రావు అవాస్తవిక ప్రచారంపై స్పందించారు. 2019లో బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని.. 2019-20లో 61 టీఎంసీలు, 2020-21లో 31.82 టీఎంసీలు, 2021-22లో 33 టీఎంసీలు, 2022-23లో 25.97 టీఎంసీలు, 2023-24లో 8.93 టీఎంసీల నీరు కలిపి 162 టీఎంసీలు మేడిగడ్డ నుంచి ఎత్తిపోశారని ఉత్తమ్ తెలిపారు. ఇందులో మళ్లీ వరదలు రాగానే సముద్రంలోకి వదిలిన నీరు 63 టీఎంసీలని, ఐదేళ్లలో 99 టీఎంసీలతో 22 లక్షల ఎకరాలకు నీళ్లు ఎలా ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. 2022 జూలైలో వరదలకు సిరిపురం (అన్నారం) పంప్‌హౌస్ నీట మునిగిందని, అదే సంవత్సరం కన్నెపల్లి (మేడిగడ్డ) పంప్ హౌస్ బ్రెస్ట్ వాల్ కూలిందని, పంప్‌హౌస్‌లోని మోటార్లన్నీ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఆ సంవత్సరం 25 టీఎంసీలే ఎత్తిపోశారని, 2023 అక్టోబరు 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని పేర్కొన్నారు.

బేషరతుగా క్షమాపణ చెప్పాలి..

ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, కమీషన్ల కక్కుర్తితో తెలంగాణకు శాశ్వత ఆర్థిక నష్టం జరిగిందని, రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రతిపాదించింది బీఆర్ఎస్ హయాంలోనే అని, నిర్మాణం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని, మేడిగడ్డ కుంగింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే అని తెలిపారు. ఫరక్కా బ్యారేజీని నీటి మళ్లింపు కోసం కడితే.. కాళేశ్వరం బ్యారేజీలు నిధుల మళ్లింపు కోసం నిర్మించారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ అవినీతికి కాళేశ్వరం బ్యారేజీలే ప్రత్యక్ష సాక్ష్యమని తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీ వైఫల్యానికి ప్రధాన కారకులు కేసీఆర్, హరీశ్‌రావులే అని తెలిపారు.

ఎత్తిపోతల కాదు.. తిప్పిపోతల పథకం..

తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి దాకా నీటిని గ్రావిటీతో తరలించడానికి 100 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ నిర్మాణం జరిగిందని, తుమ్మిడిహెట్టి బ్యారేజీ కడితే 100 కిలోమీటర్ల దాకా గ్రావిటీతో నీళ్లు వచ్చేవి అని ఉత్తమ్ తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కాదని.. తిప్పిపోతల పథకమని విమర్శించారు. ఐదేళ్లలో 162 టీఎంసీల నీటిని ఎత్తిపోసి.. 62 టీఎంసీలను తిరిగి సముద్రంలోకి వదిలేయడానికి కట్టిన పథకమని పేర్కొన్నారు. శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, లోయర్ మానేరు, అప్పర్ మానేరు, సింగూరు రిజర్వాయర్లు బీఆర్ఎస్ హయాంలో కట్టలేదని.. ఆ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. రాష్ట్రం ఏర్పడే నాటికే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింద రూ.6,156 కోట్లను వెచ్చించడం జరిగిందని, 2016 నాటికి రూ.11,679 కోట్లను వెచ్చించారని తెలిపారు.

నీటి లభ్యత లేదనడం పచ్చి అబద్ధం

తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని ఏ రోజు కూడా సీడబ్ల్యూసీ చెప్పలేదని.. అది పచ్చి అబద్ధమని ఉత్తమ్ స్పష్టం చేశారు. పైసల కక్కుర్తి కోసం, గత కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రావొద్దనే కారణాలతోనే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ ప్రాజెక్టు రూ.38 వేల కోట్లతో పూర్తై.. ఇప్పటికే తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ల దాకా 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందేదని తెలిపారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టారని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కొనసాగించి ఉంటే.. రూ.62 వేల కోట్లు ఆదా అయ్యేవి అని తెలిపారు. వాటితో పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, ఎస్ఎల్బిసీ, డిండి, సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు, ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ పూర్తయ్యేవని పేర్కొన్నారు. కమీషన్ల కక్కుర్తితో నీటిపారుదలకు తీసుకున్న అప్పులకు ఏటా రూ.16 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుదని తెలిపారు. కాళేశ్వరం అన్ని పంపులు నడిచినప్పుడు విద్యుత్ భారమే ఏడాదికి రూ.10 వేల కోట్లు అని.. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే విద్యుత్ భారం కేవలం రూ.1,000 కోట్లు అయ్యేదని తెలిపారు.

మీలా ప్రిపేర్ కాకుండా వచ్చే అలవాటు మాకు లేదు.. మంత్రి ఉత్తమ్‌కు హరీష్ రావు కౌంటర్

Next Story