- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Uttam Kumar Reddy: సీరియస్‌గా తీసుకున్నాం.. చుక్క నీటిని కూడా వదలం
కృష్ణా జలాల్లో తెలంగాణకు 70 శాతం వాటా ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా జలాల్లో తెలంగాణకు 70 శాతం వాటా ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు న్యాయమైన వాటా రావాలని కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్-2 ముందు తెలంగాణ వాదనలు వినిపిస్తున్నదని, మొత్తం 1,050 టీఎంసీలలో దాదాపు 70 శాతం అంటే 763 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. మంగళవారం ఢిల్లీలో కృష్ణ ట్రైబ్యునల్ విచారణ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ కేసు చివరి దశకు చేరుకుందని, ఫిబ్రవరి నుండి తెలంగాణ తుది వాదనలు వినిపిస్తున్నదని ఉత్తమ్ చెప్పారు. సెక్షన్-3 రిఫరెన్స్ కింద విచారణలు జరుగుతున్నాయని.. అన్ని పిటిషన్లు పూర్తయ్యాయని తెలిపారు. కొన్ని నెలలుగా సీనియర్ అడ్వకేట్ ఎస్.వైద్యనాథన్ తెలంగాణ తరఫున వాదనలు వినిపిస్తున్నారని, ఆయనకు మూడు రోజుల సమయం కేటాయించారని తెలిపారు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు స్వయంగా మంత్రి హాజరుకావడం దేశంలో ఇదే మొదటి సారి అయి ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని ఎంతగానో సీరియస్‌గా తీసుకుందో అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దే విధంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
గతంలో 1,050 టీఎంసీల కేటాయింపు
కేడబ్ల్యూడీటీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,005 టీఎంసీలు కేటాయించిందని గుర్తుచేశారు. వీటిలో 811 టీఎంసీలు 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా, 49 టీఎంసీలు 65 శాతం డిపెండబిలిటీ ఆధారంగా, 145 టీఎంసీలు సగటు ప్రవాహాల ఆధారంగా కేటాయించినట్లు చెప్పారు. అదనంగా గోదావరి డైవర్షన్ ద్వారా 45 టీఎంసీలు ఇచ్చారని.. మొత్తంగా 1,050 టీఎంసీలు కేటాయించారని తెలిపారు. సగటు ప్రవాహాల కంటే ఎక్కువగా వచ్చే నీటిని వినియోగించుకోవచ్చని స్వేచ్ఛ ఇచ్చారని.. 2014లో తెలంగాణ వేరుగా ఏర్పడిన తర్వాత ఇప్పుడు కొత్తగా బేసిన్ పారామీటర్ల ఆధారంగా వాటాను కోరుతున్నదని ఉత్తమ్ తెలిపారు. క్యాచ్‌మెంట్ ఏరియా, బేసిన్‌లోని జనాభా, కరువు ప్రాంతం విస్తీర్ణం, సాగు భూములు వంటి అంశాల ఆధారంగా లెక్కలు వేసి 75 వాతం డిపెండబుల్ వాటర్‌లో 555 టీఎంసీలు, 65 శాతం డిపెండబుల్ వాటర్‌లో 43 టీఎంసీలు, సగటు ప్రవాహాల నుండి 120 టీఎంసీలు, గోదావరి డైవర్షన్ నుండి మొత్తం 45 టీఎంసీలు తెలంగాణకు రావాలని కోరారు. మొత్తంగా ఇది 763 టీఎంసీలుగా అవుతుందని చెప్పారు. సగటు ప్రవాహాలపై మిగిలిన అదనపు నీటిని వినియోగించే స్వేచ్ఛ కూడా తెలంగాణదేనని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడిన 811 టీఎంసీల్లో ఎక్కువ మొత్తంలో బేసిన్ వెలుపలికి మళ్లించిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఇలాంటివి ఆపాలని, బదులుగా ప్రత్యామ్నాయ వనరులను వినియోగించాలని ట్రైబ్యునల్ ముందు తెలంగాణ విన్నవించినట్లు చెప్పారు. సగటు ప్రవాహాలపై మిగిలిన మొత్తం నీటిని వినియోగించే హక్కు తెలంగాణకే ఉందని, దీన్ని ట్రిబ్యునల్ ముందు బలంగా వినిపిస్తున్నట్లు తెలిపారు. ఇది కేవలం ఒక డిమాండ్ మాత్రమే కాకుండా, దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిచేసే చర్య అని చెప్పారు.
299 టీఎంసీలకు బీఆర్ఎస్ అంగీకారం
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 299 టీఎంసీలను తెలంగాణకు కేటాయిస్తూ, 512 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ఒప్పందానికి అంగీకరిస్తూ రైతులను, కరువు ప్రాంతాలను మోసం చేశారని ఉత్తమ్ అన్నారు. దాదాపు పదేళ్లపాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని అంగీకరించిందని ఆరోపించారు. అందుకే ఇప్పుడు ఆ ఫైలును మళ్లీ తెరిచి మొదటి నుంచి వాదనలు వినిపిస్తున్నామని చెప్పారు. 299 టీఎంసీలు అంగీకరించిన గత ఒప్పందం, తాము కోరుతున్న 763 టీఎంసీల మధ్య వ్యత్యాసమే ఈ అన్యాయానికి నిదర్శనమని అన్నారు. జలశక్తి మంత్రిత్వశాఖలో సైతం ఆ ఒప్పందం నమోదైనప్పటికీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా తిరస్కరించిందని వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ రాజీపడబోదని స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ ఉన్నా, తెలంగాణ గోదావరి, కృష్ణాలో తన హక్కుల కోసం కఠినంగా పోరాడుతుందని.. చుక్క నీటిని కూడా వదులుకోదని అన్నారు.
ఆల్మట్టిపై సుప్రీంలో పోరాడుతాం
ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచే కర్ణాటక ఆలోచనను మంత్రి ఉత్తమ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అలాంటి నిర్ణయం తెలంగాణకు నేరుగా నష్టం చేస్తుందని హెచ్చరించారు. దీనిని అడ్డుకోవడానికి సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వ అభిప్రాయం చాలా స్పష్టంగా ఉందని.. తెలంగాణ వాటా తగ్గించే చర్య ఏదీ అనుమతించబోమని తెలిపారు. ఆల్మట్టి ఎత్తు పెంపు అనుమతించకుండా సుప్రీంకోర్టులో పోరాడతామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్నదని, సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా సమీక్ష నిర్వహించి, పూర్తిస్థాయి వాదనలు వినిపించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని విచారణలో తెలంగాణకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.






