Minister Tummala: రెండేళ్లలో రైతుకి రూ.1.09 లక్షల కోట్ల భరోసా: మంత్రి తుమ్మల

by Ramesh Naini |

రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం రెండేళ్లలోనే రూ. 1,09,400 కోట్లు ఖర్చు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

Minister Tummala: రెండేళ్లలో రైతుకి రూ.1.09 లక్షల కోట్ల భరోసా: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం రెండేళ్లలోనే రూ. 1,09,400 కోట్లు ఖర్చు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. రైతు కేంద్రిత పాలన ఎలా ఉండాలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని స్పష్టం చేశారు. రైతు సంక్షేమం పేరుతో నినాదాలు మాత్రమే చేసిన గత పాలనతో పోలిస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఫలితాల ఆధారంగా పని చేస్తోందన్నారు. శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ, గత బీఆర్​ఎస్​ప్రభుత్వం రైతుల పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం పథకాలు ప్రకటించి, అమలులో పూర్తిగా విఫలమై రైతులను అప్పుల బారిన పడేలా చేసిందన్నారు. మా ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పకుండా 2 లక్షల లోపు రుణాలను మొదటి పంటకాలంలోనే, ఒకే దఫాలో మాఫీ చేసి లక్షలాది రైతు కుటుంబాలను నిజమైన రుణ విముక్తులుగా మార్చిందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో సమర్పించిన నివేదికతో ఈ విషయం తేట తెల్ల మైందన్నారు. రైతుబంధు పేరుతో ప్రచారం చేసి, సమయానికి నిధులు విడుదల చేయకుండా రైతులను నిరాశలో ముంచిన వారు ఇప్పుడు రైతు సంక్షేమంపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసి తమ చిత్తశుద్ది నిరూపించుకుందన్నారు.

రైతుల పేరుతో రాజకీయాలు...

‘రూ. 103 కోట్లతో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించింది.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 400 కోట్లు కేటాయించింది. రెండు పర్యాయాలు రూ. 375 కోట్ల నష్టపరిహారం చెల్లించింది. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ.65 కోట్ల విత్తన సబ్సిడీ మొత్తాన్ని చెల్లించి, సబ్సిడీపై విత్తనాలను అందచేస్తుంది. 3.5 లక్షల మట్టి నమూనా పరీక్షలు చేయించింది. కేంద్రం నుంచి సహకారం కరువైన కూడా రూ. 2710 కోట్లతో సోయాబీన్, కందులు, పొద్దుతిరుగుడు, శనగలు, వేరుశనగలు, జొన్న పంటల కొనుగోళ్లు చేయడంతో పాటు రైతు బీమా కొనసాగించింది’ అని తుమ్మల తెలిపారు. మార్కెట్ యార్డులు, గోదాములు, వ్యవసాయ మౌలిక వసతుల విషయంలో కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రేవంత్​ప్రభుత్వం రూ. 316 కోట్లు ఖర్చు చేసి ఆధునిక సదుపాయాలు కల్పిస్తూ రైతులకు భరోసా కల్పిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోదాముల సామార్థ్యాన్ని మరో 4,53,400 మెట్రిక్ టన్నులకు పెంచేలా 38 గోదాముల నిర్మాణం చేపట్టిందని, కొహెడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వంటి భారీ ప్రాజెక్టులు రైతు భవిష్యత్తుకు పునాది వేస్తాయని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో విఫలమైన ప్రతిపక్షాలు, ఇప్పుడు రైతుల పేరుతో రాజకీయాలు చేసి పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మా ప్రభుత్వం మాటలతో కాదు, పనులతో రైతులకు అండగా నిలుస్తోందని, ప్రజలు నిజం-అబద్ధం తేడా తెలుసుకోలేని అమాయకులు కారని, వాటి ఫలితాలే ఈ మధ్య వరుసగా జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు.

Next Story