Minister Tummala: మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్ఎస్​లో చేర్చాలి.. కేంద్ర మంత్రికి తుమ్మల లేఖ

by Ramesh Naini |

దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి, రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చూపుతున్న సంకల్పాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అభినందించారు.

Minister Tummala: మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్ఎస్​లో చేర్చాలి.. కేంద్ర మంత్రికి తుమ్మల లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి, రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చూపుతున్న సంకల్పాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageswara Rao) అభినందించారు. శనివారం పీఎం ధన్ ధాన్య కృషి యోజన, నేషనల్ మిషన్ ఆన్ పల్సెస్ పథకాలను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ​(Shivraj Singh Chauhan)కు అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. రాష్ట్రంలో అమలవుతున్న మద్దతు ధర పథకం (పీఎస్​ఎస్​)లో ఉన్న పరిమితులు, ప్రధాన పంటల కొనుగోలుపై కేంద్ర నిర్లక్ష్యం, రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతున్న కేంద్ర వాణిజ్య విధానాలపై అభ్యంతరం తెలిపారు. కనీస మద్దతు ధర పథకం కింద కొనుగోలు చేస్తున్న నువ్వులు, శనగలు, వేరుశనగ, సోయాబీన్, పెసళ్ళు వంటి పంటలపై సీలింగ్ విధించడంతో రైతులు తాము పండించిన పంటలో కేవలం 25 శాతం మాత్రమే మద్దతు ధరకు అమ్ముకొనే వెసులుబాటు ఉంటుందన్నారు. మార్కెట్‌లో ధరలు పడిపోయిన సమయంలో రైతుల ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ ఫెడ్ , సహకార సంస్థల ద్వారా కేంద్రం విధించిన 25 శాతం సీలింగ్ కంటే ఎక్కువ కొనుగోళ్లు చేయవలసి వస్తోందని, దీంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పీఎస్​ఎస్ ​కింద ఉన్న 25 శాతం కొనుగోలు పరిమితిని రద్దు చేయాలని లేకుంటే సడలించాలని కోరారు. వర్షాధార పంటలలో మొక్కజొన్న, జొన్న పంటలు ప్రధానమైనదని ఈ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ, కేంద్రం ద్వారా కొనుగోలు జరగకపోవడంతో రాష్ట్రం తన స్వంత నిధులతో రైతుల నుంచి కొనుగోలు చేసి నష్టపోకుండా చూడాల్సివస్తోందని చెప్పారు. రైతులకు నిర్దేశిత మద్దతు ధర భరోసా కల్పించేందుకు ఈ రెండు పంటలను పీఎస్​ఎస్​పథకం పరిధిలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. రైతు కష్టకాలంలో ఉన్నప్పుడు, రైతులకు గిట్టుబాటు ధర అందని సమయాలలో రాష్ట్రం జోక్యం చేసుకొని, కేంద్రం ప్రకటించిన కనిష్ట మద్దతు ధర చెల్లించి రైతులను కాపాడుకోవాల్సి వస్తుందని, కేంద్ర ఆర్థిక మద్దతు లేకుండా ఇది దీర్ఘకాలంగా కొనసాగడం అసాధ్యం అన్నారు. ఎంఎస్పీ అమలు, మార్కెట్ జోక్యాల్లో కేంద్ర-రాష్ట్రాల మధ్య వ్యయభారం పంచుకునే ఆర్థిక విధానం రూపుదిద్దాలని సూచించారు.

ఆయిల్ పామ్, పత్తి రైతుల పై వాణిజ్య విధానాల ప్రభావం:

నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (ఎన్​ఎంఈఓ–ఓపీ) పథకం అమలులో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందని, ఇప్పటికే 1.08 లక్ష హెక్టార్లలో 73,744 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని, ఈ ఏడాది మరో 50 వేల హెక్టార్ల విస్తరణ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కేంద్రం మే 31, 2025న క్రూడ్ పామ్ ఆయిల్‌పై కస్టమ్స్ సుంకాన్ని 27.5 శాతం నుండి 16.5 శాతానికి తగ్గించడంతో దేశీయ ధరలు తీవ్రంగా పడిపోయి, ఆయిల్ పామ్ రైతులు పొందే తాజా ఫ్రూట్ బంచ్ ధర టన్నుకి రూ 20 వేల కంటే తక్కువకు చేరిందన్నారు. పత్తి విషయంలో సీసీఐ కొనుగోళ్లు 50–60 శాతం వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయని, నాణ్యత పరమైన కారణాలు, కొనుగోళ్లలో ఆలస్యం కారణంగా రైతులకు మద్దతు ధర లభించడం లేదన్నారు. అంతేకాకుండా కాటన్ దిగుమతులపై దిగుమతి సుంకం మినహాయింపు చేయడంతో కూడా దేశీయ ధరలు మరింతగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వాణిజ్య విధానాలు రైతుల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఆయిల్ పామ్ , పత్తిపై దిగుమతి సుంక విధానాలు దేశీయ మార్కెట్ సీజన్‌లకు అనుగుణంగా ఉండేలా ఆర్థిక మంత్రిత్వ శాఖతో సమన్వయం చేయాలని కోరారు.

Next Story