- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సత్తుపల్లి బ్లాక్-3ను సింగరేణికి కేటాయించాలి : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి తుమ్మల లేఖ
రాష్ట్రంలోని సత్తుపల్లి బ్లాక్-3 బొగ్గు గని సింగరేణికి కేటాయించేలా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.

- రాష్ట్రానికి కేటాయించిన ఎరువులు వెంటనే సరఫరా చేయాలి
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని సత్తుపల్లి బ్లాక్-3 బొగ్గు గని సింగరేణికి కేటాయించేలా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. బుధవారం లేఖలో పేర్కొంటూ తాడిచర్ల-2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నామని, దేశ ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం సాహోపేతమైందన్నారు. ఇదే స్ఫూర్తితో సత్తుపల్లి బ్లాక్-3ను కూడా సింగరేణికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ ఇంధన అవసరాలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి తన బొగ్గు నిల్వలను, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ క్రమంలో వేలం ద్వారా అదనపు బొగ్గు వనరులను సమకూర్చుకునే దిశగా సంస్థ చర్యలు చేపడుతోందని వివరించారు. సత్తుపల్లి బ్లాక్-3ను 16వ దఫా బొగ్గు గనుల వేలంలో మెస్సర్స్ శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ (ఐ) లిమిటెడ్ దక్కించుకున్నట్లు తెలిపారు. ఈ సంస్థతో 2024 జనవరి 8న బొగ్గు గని అభివృద్ధి, ఉత్పత్తి ఒప్పందం కుదిరినప్పటికీ, ఇప్పటివరకు ఆ బ్లాక్‌లో మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. స్వతంత్రంగా గనిని అభివృద్ధి చేయడంలో ఆ సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసిందన్నారు. సింగరేణికి కేటాయించడం వల్ల తక్కువ వ్యవధిలోనే బొగ్గు తవ్వకాల కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంటుందని, అదనపు భూసేకరణ అవసరం గణనీయంగా తగ్గుతుందని, పర్యావరణంపై ప్రభావం కూడా తగ్గుతుందని తెలిపారు. ఇప్పటికే సింగరేణి వద్ద అందుబాటులో ఉన్న కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ , రైల్వే సైడింగ్, టౌన్‌షిప్ తదితర మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నిర్ణయం దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, సింగరేణి సంస్థ భవిష్యత్ విస్తరణకు ఎంతో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
కేటాయించిన ఎరువుల సరఫరాకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలి
ఈ సీజన్‌లో సరిపడా ఎరువుల సరఫరాకు తక్షణ చర్యలు తీసుకోవాలని, ఏప్రిల్–జూన్ నెలల్లో రాష్ట్రానికి జరిగిన ఎరువుల సరఫరా లోటును ఈ నెల అదనపు కేటాయింపుల ద్వారా భర్తీ చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు లేఖ రాశారు. రాష్ట్రంలో 55.52 లక్షల ఎకరాల్లో విత్తనాలు విత్తడం పూర్తయ్యాయని, గత ఏడాది ఇదే సమయానికి 52.04 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరగగా విస్తీర్ణం ఇప్పటికే పెరగడంతో ఎరువుల అవసరం కూడా పెరిగిందని పేర్కొన్నారు. ఏప్రిల్–జూన్ కాలంలో యూరియా 0.45 లక్షల మెట్రిక్ టన్నులు, డీఏపీ 1.04 లక్షల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 2.53 లక్షల మెట్రిక్ టన్నుల మేర లోటు ఏర్పడిందన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఉత్పత్తి అయ్యే యూరియాలో 90 శాతానికి పైగా తెలంగాణకే కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉత్పత్తి అయ్యే యూరియాను రాష్ట్ర అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.






