పచ్చిరొట్ట విత్తనాలు ఏప్రిల్ చివరికల్లా సిద్ధం చేయాలి : వ్యవసాయ శాఖకు మంత్రి ఆదేశాలు

by Ramesh Naini |

రాష్ట్రంలో రైతులకు సబ్సిడీపై అందించే పచ్చిరొట్ట విత్తనాలను వచ్చే ఏప్రిల్ నెలాఖరు సిద్ధంగా ఉంచుకోవాలని అందుకు తగ్గ ఏర్పాట్లు తీసుకోవాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు.

పచ్చిరొట్ట విత్తనాలు ఏప్రిల్ చివరికల్లా సిద్ధం చేయాలి : వ్యవసాయ శాఖకు మంత్రి ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి వ్యవసాయ యాంత్రీకరణ రాయితీ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసే విధానం అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని అదికారులకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శనివారం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించిన రానున్న ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు సబ్సిడీపై అందించే పచ్చిరొట్ట విత్తనాలను వచ్చే ఏప్రిల్ నెలాఖరు సిద్ధంగా ఉంచుకోవాలని అందుకు తగ్గ ఏర్పాట్లు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతు వేదికలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని, ఇందుకు రెడ్కో సంస్థ సహకారం తీసుకోవాలన్నారు. మొదట ప్రయోగాత్మకంగా జంగారెడ్డి పల్లి, జనంపేట రైతు వేదికలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి వాటి పనితీరును పరిశీలించిన తరువాత మొదటి దశలో 1600 రైతు వేదికలలో రెడ్కో ద్వారా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రానున్న ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి అవసరమైన ఎరువులను ముందుగానే తెప్పించి నిల్వ ఉంచేందుకు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలని సూచించారు. ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రానికి అవసరమైన ఎరువులను ముందుగానే సమకూర్చుకోవాలని తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలన్నారు. మక్కలు, వరి, పత్తి పంటలతో పోలిస్తే యూరియా అవసరం దాదాపు మూడింతలు ఎక్కువగా ఉంటుందని చెప్పారు. నీటి నిల్వలు సమృద్ధిగా ఉండటం, నేలలో తేమ నిల్వ ఉండటం, అలాగే దక్షిణ పశ్చిమ రుతుపవనాలు సాధారణంగా ప్రారంభమవుతాయనే అంచనాలతో ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం సుమారు 60.60 లక్షల హెక్టార్లలో సాగు అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ 2026 సీజన్‌కు రాష్ట్రానికి 11.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

Next Story