- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rythu Bharosa: రేపటికి రైతు భరోసా నిధుల విడుదల పూర్తి.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన
సాగులో ఉన్న ప్రతి గుంటకు రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సాగులో ఉన్న ప్రతి గుంటకు రైతు భరోసా (Rythu Bharosa) నిధులు జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) తెలిపారు. ఇప్పటివరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 8284.66 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలిపారు. ఎకరాలతో సంబంధం లేకుండా సాగులో ఉన్న మిగతా భూములకు కూడా రైతు భరోసా నిధుల ప్రక్రియను రేపటి వరకు పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ కీలక ప్రకటన విడుదల చేశారు. రైతుకు భరోసా.. రేవంతన్న అనేలా ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే వానాకాలం రైతు భరోసా ప్రక్రియను పూర్తి చేసి, రైతులపై తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నామన్నారు. జూన్ 16 న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకున్న రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు రెండు ఎకరాల వరకు రూ. 2349.83 కోట్లు, రెండో రోజు 3 ఎకరాల వరకు 3901.73 కోట్లు, మూడో రోజు 4 ఎకరాల వరకు 5215.26 కోట్లు, నాలుగో రోజు 5 ఎకరాల వరకు 6404.70 ఎకరాలు, ఐదో రోజు 7 ఎకరాల వరకు 7310.59 కోట్లు, ఆరో రోజు 9 ఎకరాల వరకు 7770.83 కోట్లు, ఏడో రోజు 15 ఎకరాల వరకు 8284.66 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు.
ఇంత తక్కువ రోజుల్లోనే రైతుభరోసా నిధుల జమ ప్రక్రియను పూర్తి చేయడం రాష్ట్ర చరిత్రలోనే మొట్ట మొదటిసారి అని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్న.. ఎలాంటి రాజీ పడకుండా వానాకాలం రైతుభరోసా పథకాన్ని పూర్తిచేసిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆనందంలో మునిగిపోయారని అన్నారు. ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిందని, కానీ ఇవేమి కనబడని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఇప్పటికైనా మా ప్రభుత్వం రైతులకు చేస్తున్న మంచిని గ్రహించి దురుద్దేశంతో చేసే విమర్శలు మానుకోవాలని, రైతులకు మేలు చేసే ఆలోచనలతో ముందుకురావాలని హితవు పలికారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతుభరోసా నిధులను ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే పూర్తి చేసిన సందర్భంగా, సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రైతుపండగ కార్యక్రమంలో సాయంత్రం 6 గంటలకు రైతులను ఉద్ధేశించి సీఎం మాట్లాడుతారని తెలిపారు. సీఎంకి కృతజ్ఙతపూర్వకంగా ప్రజా ప్రతినిధులు రైతులతో కలిసి వారి వారి నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ఈ రైతుపండగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.






