తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ చీరల సెకండ్ డిజైన్ పూర్తి

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-08 15:43:59  IST  )

చేనేత వైభవం ప్రపంచానికి పరిచయం చేస్తూ, నేతన్నల కష్టానికి తగిన గౌరవం తీసుకురావాలనే లక్ష్యంతో చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ చీరల సెకండ్ డిజైన్ పూర్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: చేనేత వైభవం ప్రపంచానికి పరిచయం చేస్తూ, నేతన్నల కష్టానికి తగిన గౌరవం తీసుకురావాలనే లక్ష్యంతో చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం నగరంలో చేనేత వస్త్ర ప్రదర్శనను జౌళిశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, ఇతర ఉన్నతాధికారులు, చేనేత సంఘాల ప్రతినిధులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. పది రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేత కార్మికులు తమ అద్భుత కళాఖండాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ప్రభుత్వం చేనేత రంగ పునరుద్ధరణకు అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. గతంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేతన్న కుటుంబాలు, ప్రస్తుతం ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదు అది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, సృజనాత్మకతకు ప్రతీక. నేతన్న చేతిలో నూలుపోగు తిరిగితే వేల కుటుంబాల్లో వెలుగు వెలుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇలాంటి ప్రదర్శనలు కేవలం అమ్మకాల వేదికలు మాత్రమే కాకుండా, గ్రామీణ కళాకారుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే మహత్తర వేదికలని అన్నారు.

ఇందిరమ్మ చీరలతో నేతన్నల జీవితాల్లో వెలుగు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ చీరలు పథకం చేనేత రంగానికి గొప్ప ఊతమిచ్చిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలను అందించడం ద్వారా నేతన్నల ఇళ్లలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడిందన్నారు. ఇప్పటికే రెండో డిజైన్‌కు సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ పథకం వల్ల హ్యాండ్‌లూమ్, పవర్‌లూమ్ కార్మికులకు నిరంతర ఉపాధి లభిస్తోందని, వేలాది కుటుంబాలు ప్రభుత్వంపై విశ్వాసంతో జీవనం సాగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా చేనేత రంగాన్ని తీర్చిదిద్దేందుకు హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సంస్థ ద్వారా యువతకు ఆధునిక డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ, మార్కెటింగ్, డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. సంప్రదాయ కళను ఆధునిక సాంకేతికతతో మేళవిస్తేనే మన చేనేత ప్రపంచస్థాయిలో నిలుస్తుంది. యువత చేనేత రంగాన్ని ఉపాధి అవకాశంగా స్వీకరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

అగ్గిపెట్టెలో పట్టే చీర.. మన నేతన్న ప్రతిభకు నిదర్శనం..

తెలంగాణ నేతన్నల ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన అద్భుత చరిత్ర మన నేతన్నలది. అలాంటి గొప్ప వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చేనేత అనేది కేవలం వస్త్ర తయారీ మాత్రమే కాదని అది తరతరాలుగా వస్తున్న కళాత్మక సంపద అని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఈ ప్రదర్శనలో గద్వాల, పోచంపల్లి, నారాయణపేట, సిరిసిల్ల తదితర ప్రాంతాలకు చెందిన ప్రసిద్ధ చేనేత వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. నేత కార్మికులు స్వయంగా నేసిన చీరలు, దుస్తులు, కళాత్మక వస్త్రాలను నేరుగా వినియోగదారులకు అందిస్తున్నారు. నాణ్యమైన చేనేత వస్త్రాలను నేరుగా కార్మికుల నుంచే కొనుగోలు చేయడం ద్వారా వారి జీవనోపాధికి తోడ్పడాలని అధికారులు నగర ప్రజలను కోరారు. ఈ ప్రదర్శనకు ఇప్పటికే విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ప్రదర్శన ప్రారంభమైన తొలి రోజే పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరై చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. సంప్రదాయ డిజైన్లు, ఆధునిక శైలుల సమ్మేళనంగా రూపొందించిన చీరలు మహిళలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చేనేత శాఖ అధికారులు, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, డిజైనర్లు, కళాకారులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో నగర ప్రజలు పాల్గొన్నారు.

Next Story