TG: రైతులకు మళ్లీ ఆ కష్టాలు రాకుండా ప్రభుత్వం చర్యలు

by Gantepaka Srikanth |

రాబోయే ఖరీఫ్ 2026 వ్యవసాయ సీజన్ దృష్ట్యా రాష్ట్రంలో ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

TG: రైతులకు మళ్లీ ఆ కష్టాలు రాకుండా ప్రభుత్వం చర్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే ఖరీఫ్ 2026 వ్యవసాయ సీజన్ దృష్ట్యా రాష్ట్రంలో ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఏప్రిల్, మే, జూన్ నెలలకు ప్రతినెలా 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున యూరియాను కేటాయించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హార్టికల్చర్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు లేఖ రాశారు. గత రబీ సీజన్‌లో రాష్ట్రానికి సమయానికి యూరియా కేటాయించినందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయగలిగామని తెలిపారు. గత ఖరీఫ్ సీజన్‌లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా వ్యవసాయ కార్యకలాపాలు సజావుగా సాగాయని పేర్కొన్నారు. రాష్ట్ర రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సమయానుకూలంగా స్పందించడం వల్ల వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రబీ సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఖరీఫ్–2026 సీజన్ ప్రారంభానికి యూరియా ప్రారంభ నిల్వలు 50 వేల మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే ఉండవచ్చని మంత్రి తెలిపారు. 2024 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రానికి గణనీయమైన ప్రారంభ నిల్వలు ఉండటం వల్ల ఎరువుల సరఫరా సాఫీగా జరిగిందని గుర్తు చేశారు.

ఖరీఫ్ 2024 లో 4.65 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, ఖరీఫ్ 2025లో 1.99 లక్షల మెట్రిక్ టన్నుల ప్రారంభ నిల్వలు ఉన్నాయని, వాటి వల్ల ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రావడం జరిగిందని గుర్తుచేశారు. అయితే.. ఈ సంవత్సరం ప్రారంభ నిల్వలు 50 వేలకు మించి ఉండకపోవచ్చని తెలిపారు. 2024 ఖరీఫ్ సీజన్లో ఉన్న నిల్వలు రాష్ట్రానికి బఫర్ స్టాక్ ఏర్పాటుకు దోహదపడి రైతులకు ఎరువులు నిరంతరంగా అందుబాటులో ఉండేలా చేశాయని తెలిపారు. అయితే.. రాబోయే ఖరీఫ్ సీజన్‌కు ఈ విధంగా ప్రారంభ నిల్వలు ఉంచుకోవడం ఇప్పుడు ప్రాధాన్యతగా మారిందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు 70 శాతం పంటలు ఖరీఫ్ సీజన్‌లోనే సాగవుతాయని తెలిపారు. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలు ఈ సీజన్‌లో విస్తృతంగా సాగు అవుతాయని.. ఈ పంటలకు అధిక మొత్తంలో యూరియా అవసరం ఉంటుందని పేర్కొన్నారు. సాధారణంగా రాష్ట్రంలో జూలై, ఆగస్టు నెలల్లో యూరియా వినియోగం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని మంత్రి వివరించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఖరీఫ్ సీజన్ కొంత ముందుగానే ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. అందువల్ల రైతులకు సమయానికి ఎరువులు అందుబాటులో ఉండేందుకు ముందుగానే నిల్వలు ఏర్పాటు చేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

Next Story