- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో కలిసిన ఐదు గ్రామాలు తెలంగాణలో విలీనం చేయాలి.. ఏపీ సీఎంను కోరిన మంత్రి తుమ్మల
రాష్ట్ర పునర్విభజన సమయంలో భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న ఏపీలోని ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడిని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర పునర్విభజన సమయంలో భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న ఏపీలోని ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడిని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. యేటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ ప్రాంతాల మధ్యలో ఉండటంతో ప్రజలు పరిపాలనా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సోమవారం ఏపీ రాజధాని అమరావతి వెళ్లి ఖమ్మం జిల్లాకు సంబంధించిన సాగునీటి వసతులు, భక్తులు, ప్రజల సౌకర్యానికి సంబంధించిన పలు కీలక విజ్ఞప్తులు చేశారు. ఈ సందర్భంగా వారు ఒక ప్రకటనలో పేర్కొంటూ విలీన గ్రామాలు గోదావరి నది, అటవీ ప్రాంతాల మధ్య ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంక్లేవ్‌లా మారిపోయాయని, జిల్లా కేంద్రాలకు చేరుకోవడానికి ప్రజలు దాదాపు 8 గంటలు ప్రయాణించాల్సి వస్తుందని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, పన్నులు, పరిపాలనా అనుసంధానం లోపం, భద్రతా సమస్యలు వంటి అంశాలు స్థానిక గిరిజన ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయని వివరించారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయం భూభాగాల్లో కొంత భాగం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండటంతో దేవస్థానం పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలు అందించాలంటే ఈ గ్రామాల విలీనం అవసరమని అభిప్రాయపడ్డారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం కోసం విలీనం తప్పదన్నారు.
ప్రాజెక్టు శాశ్వత మరమ్మతులు చేపట్టాలి..
ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు సాగునీటి ప్రాజెక్టు శాశ్వత మరమ్మత్తులు అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం ఉందని, ప్రాజెక్టు ద్వారా 16 వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా, అందులో సుమారు 13,640 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 2,360 ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అని తెలిపారు. ప్రాజెక్టు శాశ్వత పునరుద్ధరణకు సుమారు రూ.92.20 కోట్ల వ్యయం అంచనా వేయబడిందని, రెండు రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ఖర్చును 85:15 నిష్పత్తిలో భరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పరిధిలో గోదావరి వరద రక్షణ కరకట్టలోని 3వ స్లూయిస్ వద్ద గోడ దెబ్బతిన్నదని, భద్రాచలం పట్టణాన్ని వరదల నుంచి రక్షించేందుకు నిర్మించిన ఈ రక్షణ గోడలో జరిగిన ఈ నష్టం భవిష్యత్తులో భారీ ప్రమాదానికి దారి తీస్తుందన్నారు. కరకట్ట లోని ఆ భాగం విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్లడంతో నిర్వహణలో సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు ఏపీ ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తగిన చర్యలు తీసుకోలేదన్నారు.
తిరుమలలో తెలంగాణ భక్తుల కోసం..
రెండు రాష్ట్రాలు సమన్వయంతో శాశ్వత పునరుద్ధరణ చర్యలు ప్రారంభించాలని, ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఖమ్మం పట్టణంలో వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి అవసరమైన భూమి గుర్తించామని, టీటీడీ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. తిరుమలలో తెలంగాణ భక్తుల కోసం ప్రత్యేక యాత్రికుల భవనం నిర్మాణానికి సుమారు 5 ఎకరాల భూమి కేటాయించాలని ప్రతిపాదించారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో వసతి కొరతను తగ్గించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఉపయోగపడుతుందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం పెంపొందిస్తే సాగునీరు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, భక్తుల మౌలిక వసతుల విస్తరణలో వేగవంతమైన పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సత్తుపల్లి కొవ్వూరు రైల్వే లైన్, పెనుబల్లి అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






