- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రం ప్రకటనలకే పరిమితం: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడానికి ఈ సీజన్‌లో కేంద్రం ముందుకు రావాలని, శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25శాతం పరిమితిని ఎత్తివేసి, పూర్తిగా కొనుగోలు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడానికి ఈ సీజన్‌లో కేంద్రం ముందుకు రావాలని, శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25శాతం పరిమితిని ఎత్తివేసి, పూర్తిగా కొనుగోలు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ పంటలకు మద్దతు ధర ప్రకటించడం, ప్రతి సంవత్సరం పెంచడం వరకే కేంద్రం పరిమితమైందని, వాస్తవ కొనుగోళ్ల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని తెలిపారు. మద్ధతు ధరకు మార్కెట్ ధరకు భారీ వ్యత్యాసం ఉన్నప్పుడు కూడా పంటల కొనుగోళ్లకు రాష్ట్రాలకు మద్ధతు ఇవ్వకపోవడం ఏ రకంగా రైతులు అర్థం చేసుకోవాలన్నారు. అధికంగా వరి ఉత్పత్తి అయినప్పటికీ, ధాన్యం సేకరణను ప్రతి సంవత్సరం తగ్గించడం, దొడ్డు బియ్యం సేకరణ విషయంలో మాట మార్చడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. సోయాబీన్, చిక్కుడు, వేరుశనగ, పెసలు, పొద్దుతిరుగుడు వంటి పంటల ఉత్పత్తిలో కేవలం 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్రం పరిమితులు విధించడంతో మిగిలిన పంటను మద్ధతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి వస్తోందని, దీంతో రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడుతోందన్నారు.
మొక్కజొన్న పంట విషయంలో కూడా కేంద్రం కేవలం మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. పరిమితులకు మించిన పంటలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడంతో పాటు మొక్కజొన్న పంటను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని చెప్పారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో మొక్కజొన్న పంట సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం, కనీసం యాసంగి సీజన్‌లో అయినా కేంద్రం కొనుగోళ్లలో అనుమతులు ఇస్తుందని ఆశించినప్పటికీ, ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఇప్పటికే 200కి పైగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, 1,20,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనగోళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా తగ్గిస్తున్న లెవి అడ్డంకిగా మారుతుందని, పత్తి విషయంలో కొత్త పద్ధతి తీసుకురావాలి అని చూస్తుంది అని, వీటిని కూడా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందన్నారు. మొక్కజొన్న పంటను నాఫెడ్ ద్వారా కొనుగోలుకు అనుమతులు ఇవ్వాలని, శనగ, పొద్దుతిరుగుడు పంట కొనుగోళ్లపై ఉన్న 25 శాతం పరిమితిని ఎత్తివేసి, పూర్తిగా కొనుగోలు చేయాలని పలుమార్లు కోరిన కేంద్రానికి స్పందన లేకపోవడం బాధకరమన్నారు.






