ఒక్క రైతు కూడా ఇబ్బంది పడొద్దు: మంత్రి తుమ్మల

by Gantepaka Srikanth |

ఒక్క రైతు కూడా ఇబ్బంది పడొద్దు: మంత్రి తుమ్మల

ఒక్క రైతు కూడా ఇబ్బంది పడొద్దు: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో: సహకార శాఖ ఆడిటర్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆడిట్‌ను వారంలోగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. ప్రభుత్వ సహాయం లేకుండా నడిచే సహకార సంఘాల ఆడిట్ ను జనవరిలోగా పూర్తి చేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో జిల్లా సహకార, డిసీసీబీ సీఈఓతో వీడియో కాన్పరెన్స్​నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సంఘాలలో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన సెక్షన్ 51 విచారణ, సెక్షన్ 52 పరిశీలనలు చట్టం ప్రకారం నిర్ణయించిన సమయంలో పూర్తి చేసి బాధ్యులపై వెంటనే తగిన చర్యలు తీసుకొని, దుర్వినియోగం అయిన మొత్తాలను తిరిగి రాబట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సర్ ఛార్జీ చేయబడిన కేసుల విషయంలో దుర్వినియోగమైన మొత్తాలను రాబట్టేందుకు చట్టపరమైన చర్యలు చేపట్టాలని, ఎంక్వయిరీలు, సర్ చార్జీల విషయంలో ఏమైన కోర్టు కేసులు ఉంటే జీపీని సంప్రదించి కేసులు పూర్తి చేయాలన్నారు. సంఘాల పనితీరును ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.

సహకార సంఘాల ద్వారా వరి ధాన్యం కొనుగోళ్లను సమర్ధవంతంగా నిర్వహించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో నిర్దేశించిన సగటు నాణ్యత ప్రమాణాల ప్రకారం కొనుగోలు చేయాలని, కొనుగోలు జరిగిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు రైతులకు ఉండకుండా చూడాలన్నారు. ప్రతి సహకార సంఘ పరిధిలో కనీసం 100 ఎకరాలపైన ఆయిల్ పాం సాగుకోసం రైతులను గుర్తించి సాగుచేసేలా, సహకార అధికారులు సంఘాల సీఈఓ లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్ పాం పంట వేసిన తరువాత 3 సంవత్సరాల నుండి దిగుబడి మొదలవుతుందని, 35 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుందని, సంవత్సరానికి ఖర్చులు పోగా ఎకరానికి రూ. 15 లక్షలపైగా నికర ఆదాయం లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ సహకార శాఖ సెక్రెటరీ సురేంద్ర మోహన్, హార్టీ కల్చర్ డైరెక్టర్ యాస్మిన్ ,మార్క్ ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి , టీజీ క్యాబ్​అధికారులు పాల్గొన్నారు.

Next Story