యాసంగికి సరిపడ యూరియా అందుబాటులో ఉంచాలి: మంత్రి తుమ్మల

by Ajay Maddhiboyina |

గత రబీ సీజన్ లో మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన జొన్నలను ఎక్కువకాలం నిల్వ చేయకుండా, మంచి ధర వచ్చిన వెంటనే తరలించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు.

యాసంగికి సరిపడ యూరియా అందుబాటులో ఉంచాలి: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : గత రబీ సీజన్ లో మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన జొన్నలను ఎక్కువకాలం నిల్వ చేయకుండా, మంచి ధర వచ్చిన వెంటనే తరలించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. దీంతో ఖాళీ అయిన గోదాములను రైతులకు ఇతర ఉత్పత్తుల నిల్వల కోసం ఉపయోగించాలని సూచించారు. బుధవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రానున్న రబీ సీజన్ కోసం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలలో ప్రతి నెల 2 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 4 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 3.05 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయిందని, మిగిలిన యూరియా కూడా రాష్ట్రానికి సరఫరా అయ్యే విధంగా కేంద్ర రసాయనాల శాఖ అధికారులతో సంప్రదింపులు చేయాలని వ్యవసాయశాఖ సెక్రటరీకి ఆదేశించారు.

అదే విధంగా రైల్వే శాఖ వారు వరంగల్ రేక్ పాయింట్ ను మూసివేసి గూడ్స్​హ్యాండ్ లైనింగ్ ను చింతలపల్లి రేక్ పాయింట్ కు మార్చితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎరువుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. రబీ సీజన్ ముగిసే సమయం వరకు వరంగల్ రేక్ పాయింట్ ను కొనసాగించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రికి లేఖ రాసినట్టు తెలిపారు. అదేవిధంగా రామగుండం ఎరువుల కర్మాగారం నుండి 100 శాతం కేటాయింపులు రాష్ట్రానికి జరిగేలా చూడాలని కేంద్ర రసాయనాల శాఖ మంత్రిని లేఖ ద్వారా కోరినట్లు చెప్పారు. జనవరి వరకు కనీసం 3.50 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ తో రబీ సీజన్ కోసం రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రెగ్యులర్ గా వచ్చే యూరియా సరఫరాలతో రైతులకు యూరియా పంపిణీ చేయడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

అనంతరం పత్తి కొనగోళ్లపై అధికారులతో చర్చి అన్ని జిన్నింగ్ మిల్లులను ప్రారంభించడం జరిగిందని, పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. స్లాట్ బుకింగ్ లో ఇంకా అక్కడక్కడ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు దృష్టికి వచ్చిందని, ఈ సమస్యలను వెంటనే పరిష్కరించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 2.63 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించినట్లు అధికారులు తెలిపారు. శాటిలైట్ చిత్రాల ద్వారా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసే సాంకేతికతను త్వరగా అందుబాటులోకి తెచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. రబీ సీజన్ రైతు భరోసా అందించే సమయానికి ఈ సాంకేతికతను పూర్తిగా వినియోగంలోకి తేవాలని, తద్వారా సాగు విస్తీర్ణం ప్రకారం రైతుభరోసా నిధులు జమ చేయడం సులభం అవుతుందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మి బాయి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story