మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలి: మంత్రి తుమ్మల

by Ajay Maddhiboyina |

రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.

మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలి: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూ. 1650 కోట్లతో 1.22 లక్షల మంది రైతుల నుండి 6.74 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసిందని, మొక్కజొన్న కొనుగోళ్లలో గోదాముల లభ్యత, హమాలీల కొరత, గన్నీబ్యాగుల లభ్యత, రవాణా అంశాల్లో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్‌ తో చర్చించి మొక్కజొన్న కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లతో పాటు, వరిధాన్యం కొనుగోళ్లు కూడా విస్తారంగా జరుగుతున్నందున, కలెక్టర్లు మొక్కజొన్న కొనుగోళ్లలో కూడా బాధ్యత తీసుకొని, కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరారు.

మొక్కజొన్న కొనుగోళ్లలో కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని, కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మార్క్ ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొనుగోళ్లు, రవాణా సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు. గోదాముల ఏర్పాటు, గన్నీ బ్యాగుల అందుబాటు, హమాలీల నియామకం, రవాణా సౌకర్యాల సమన్వయం వంటి అంశాలపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు, మార్క్‌ఫెడ్ అధికారులతో కలిసి పనిచేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నుండి గోదాముల వరకు రవాణాలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ కమిషనర్ ఇలంబద్రి కోరడంతో వెంటనే రవాణా శాఖ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్‌ను నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ దిగుబడులను విక్రయించుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, జిల్లా యంత్రాంగం కొనుగోలు కార్యక్రమాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులు :

మొక్కజొన్న మార్కెట్ కు భారీ వస్తుండటంతో ఉమ్మడి జిల్లాల వారిగా రాష్ట్ర స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ, వ్యవసాయశాఖ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. డా. బి. గోపి, వ్యవసాయ సంచాలకులు వరంగల్, కరీంనగర్, రాహుల్ రాజ్ స్పెషల్ కమిషనర్ – మెదక్, ఖమ్మం జిల్లాలు, యాస్మీన్ బాషా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆదిలాబాద్, డా. కొర్ర లక్ష్మి నిజామాబాద్ లకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది.

Next Story