- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరి ఎగుమతులపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వరికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో పాటు ఎగుమతులకు కూడా అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు...

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వరికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో పాటు ఎగుమతులకు కూడా అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కూడా వీటి సాగును ప్రోత్సహించాలని సూచించారని, ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించిన తర్వాత పరిస్థితి మారి ప్రస్తుతం సన్న రకాల సాగు 60 శాతానికి చేరుకుందని వివరించారు. బుధవారం సచివాలయంలో విత్తన కంపెనీల ప్రతినిధులు, ఎరువుల డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, కృషి వాస్ ప్రతినిధులతో సమావేశం జరిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన విత్తనాలను రైతులకు ఎలాంటి కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని, రైతులకు విత్తనాల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని, ఈ రకాలను ఏ రైతు ఎంత విత్తనం కొనుగోలు చేశాడనే వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని ఆదేశించారు. విత్తన సబ్సిడీపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని, వ్యవసాయ యాంత్రీకరణ పథకం తరహాలో సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
విత్తనాల పంపిణీ కోసం అవసరమైతే రైతు వేదికలను ప్రత్యేక కేంద్రాలుగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈ ఏడు వరి రకాలకే బోనస్ వర్తిస్తుందని స్పష్టం చేసిన మంత్రి, కంపెనీల వారీగా అందుబాటులో ఉన్న విత్తనాల నిల్వలను రైతులకు తెలిసేలా ప్రదర్శించాలని సూచించారు. అదేవిధంగా ఆయా రకాల అమ్మకం, విక్రయాలను రోజువారిగా అప్ డేట్ చేయాల్సిందిగా డీలర్లను ఆదేశించారు. రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం ప్రభుత్వంతో పాటు డీలర్ల బాధ్యత అని పేర్కొన్నారు. అవసరమైతే రైతు వేదికలను తాత్కాలిక విక్రయ కేంద్రాలుగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా భూమికి అనుసంధానం చేసి, సాగు విస్తీర్ణం ఆధారంగా యూరియా పంపిణీ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం యూరియా యాప్‌ను రూపొందించిందన్నారు.
శాటిలైట్ సాంకేతికతతో చీడపీడల గుర్తింపు :
శాటిలైట్ చిత్రాల ఆధారంగా పంటల్లో చీడపీడలను, వ్యాధులను రియల్ టైమ్‌లో గుర్తించి, అవి విస్తరించకముందే రైతులకు సమాచారం అందించే విధంగా కృషి వాస్ ప్రాజెక్ట్ పనిచేస్తోందని కంపెనీ ప్రతినిధులు వివరించారు.ఈ విధానం ద్వారా రైతులు ప్రతిరోజూ పొలాల్లో తిరిగి వ్యాధులను గుర్తించాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు. రైతులకు ముందస్తు హెచ్చరికలతో పాటు అవసరమైన పురుగుమందులపై సూచనలు కూడా అందించడంతో వ్యాధుల వ్యాప్తిని నివారించి దిగుబడులను కాపాడుకోవచ్చని చెప్పారు. ఈ ప్రాజెక్టు పైలట్ అమలుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలాన్ని ఎంపిక చేసినట్లు ప్రతినిధులు వివరించారు. అక్కడి రైతులకు ఇప్పటికే పంటల పరిస్థితులపై సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కృషి వాస్ సేవల ద్వారా లబ్ధి పొందిన దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామానికి చెందిన పెరుమళ్ళ వీరభద్రరావు అనే రైతుకు మంత్రి తుమ్మల స్వయంగా ఫోన్ చేసి, ప్రాజెక్టు వల్ల కలిగిన ప్రయోజనాలు మరియు కంపెనీ తీసుకుంటున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. కంపెనీ వారు ఉపయోగించిన సాంకేతికత, యూనివర్సిటీ ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాంకేతికతలో తారతమ్యాలని యూనివర్సిటీ అధికారులు మంత్రికి వివరించారు. ప్రపంచంలో ఉన్న ఉత్తమ సాంకేతికతను మన తెలంగాణ రైతులకు అందుబాటులోకి తేవాలన్నది తమ ప్రభుత్వ ధ్యేయమని, ఈ పంట కాలానికి సాంకేతిక ఫలాలు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.






