- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు బీమాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
రాష్ట్రంలో రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం అత్యంత బాధ్యతతో అమలు చేస్తోందని, దీనిపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు...

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం అత్యంత బాధ్యతతో అమలు చేస్తోందని, దీనిపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం రైతు సంక్షేమం పట్ల అంకితభావంతో పని చేస్తోందని తెలిపారు. గత రెండున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 66,038 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా ద్వారా రూ.3,301.90 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం నేరుగా నామినీల ఖాతాల్లో జమ చేసిందని మంత్రి తెలిపారు. 2023 డిసెంబర్ నుంచి ఏడాది ముగిసే వరకు 20,090 కుటుంబాలకు రూ.1,004.50 కోట్లు, 2024లో 25,861 కుటుంబాలకు రూ.1,293.05 కోట్లు అందించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత 2025-26 సంవత్సరానికి సంబంధించి 42.16 లక్షల మంది రైతులు నమోదు చేసుకోగా, వారికి వర్తించేలా ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన రూ.1,359.56 కోట్ల ప్రీమియంను ఇప్పటికే పూర్తిగా చెల్లించామని వెల్లడించారు. ఈ క్రమంలోనే మరో 20,087 కుటుంబాలకు రూ.1,004.35 కోట్ల బీమా సాయాన్ని అందజేసినట్లు వివరించారు.
పథకాలు ఆపడమే గత ప్రభుత్వ నైజం..
రైతు బీమా పథకం నిలిచిపోయిందని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి తుమ్మల ఖండించారు. పథకాలను నిలిపివేసి రైతులను ఇబ్బందులకు గురిచేసిన చరిత్ర గత ప్రభుత్వానిదేనని విమర్శించారు. వ్యవసాయ యాంత్రీకరణ, సాయిల్ హెల్త్ టెస్టులు, సబ్సిడీ విత్తనాల వంటి పథకాలను ఆపి, కేంద్ర ప్రాయోజిత పథకాలకు గండికొట్టింది గత ప్రభుత్వమే అని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఆపేసిన పథకాలను కూడా తాము పునరుద్ధరిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని నిలిపివేయలేదని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పనికిమాలిన రాజకీయ విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.






