- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగొద్దు.. అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
రాష్ట్రంలో పత్తి రైతులకు ఇబ్బంది కలగకుండా వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని జిన్నింగ్ మిల్లర్స్, సీసీఐని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పత్తి రైతులకు ఇబ్బంది కలగకుండా వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని జిన్నింగ్ మిల్లర్స్, సీసీఐని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) ఆదేశించారు. సోమవారం సచివాలయంలో పత్తి కొనుగోలుకు సంబంధించి సీసీఐ, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో పాటు జిన్నింగ్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. సీసీఐ విడుదల చేసిన టెండర్ లో లింట్ శాతం ఎల్1. ఎల్2 అలాట్మెంట్ స్లాట్ బుకింగ్ ఏరియా మ్యాపింగ్ కోసం ఉన్న నిబంధనలపై చర్చించినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే మన రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లర్లు వెంటనే టెండర్లలో పాల్గొని ఎలాంటి జాప్యం లేకుండా పత్తి కొనుగోళ్లు ను ప్రారంభించాలని సూచించారు. పత్తి కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సీసీఐ ,జిన్నింగ్ మిల్లర్లను ఆదేశించారు. రైతులకు ఇబ్బంది కలిగే చర్యలు చేపట్టిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
పత్తి కొనుగోళ్లలో కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలలో ఏదైనా ఇబ్బందులు ఉంటే సీసీఐ జిన్నింగ్ మిల్లర్లు కూడా నష్టపోకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. జిన్నింగ్ మిల్లుల పరిశ్రమకు సంబంధించిన మార్గదర్శకాల విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే, వాటిని పరిష్కరించడానికి స్వతంత్ర ఏజెన్సీ ద్వారా సమస్యలను పరిశీలించి ధృవీకరించుకొని ఎప్పటికప్పుడు తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. రైతుల సమస్యలు దృష్టిలో ఉంచుకొని జిన్నింగ్ మిల్లర్లు వెంటనే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని , సీసీఐ కొనుగోళ్ల ప్రక్రియ కోసం వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలనీ , రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల పరిరక్షణ కు ఎంత దూరమైనా వెళుతుందని చెప్పడంతో ఏకీభవించిన సీసీఐ, జిన్నింగ్ మిల్లర్లు కొనుగోళ్లకు సంబంధించి అన్ని ప్రక్రియలు వెంటనే పూర్తి చేసి రానున్న వారం రోజుల్లో రైతుల నుంచి పత్తి సేకరిస్తామని తెలిపారు.
వ్యవసాయ శాఖ ఈ లోపు మొబైల్ యాప్ , స్లాట్ బుకింగ్ యాప్ పై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించగా ఇప్పటికే మండలాల వారీగా రైతు వేదికల ద్వారా ఈ యాప్ గురించి స్లాట్ బుకింగ్ గురించి అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి , సీసీఐ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తా, శ్రీ పూర్ణేష్ గురునాని, డైరెక్టర్ (ఫైబర్), టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మి భాయి తదితరులు పాల్గొన్నారు.






