- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మక్కల కొనుగోలు పరిమితి 25 క్వింటాళ్లకు పెంచాలి.. మంత్రి తుమ్మల ఆదేశాలు
వానాకాలం సీజన్ లో మక్కల దిగుబడి ఎక్కువగా ఉండడంతో రైతులు, ప్రజా ప్రతినిధుల విజ్ఙప్తి మేరకు మక్కల కొనుగోలు పరిమితిని ఎకరాకు 18.5 క్వింటాళ్ల నుండి 25 క్వింటాళ్ల కు పెంచాలని మార్క్ ఫెడ్ ఎండీని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వానాకాలం సీజన్‌లో మక్కల దిగుబడి ఎక్కువగా ఉండడంతో రైతులు, ప్రజా ప్రతినిధుల విజ్ఙప్తి మేరకు మక్కల కొనుగోలు పరిమితిని ఎకరాకు 18.5 క్వింటాళ్ల నుండి 25 క్వింటాళ్లకు పెంచాలని మార్క్ ఫెడ్ ఎండీని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Thummala) ఆదేశించారు. సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా మక్కల కొనుగోలు కోసం 125 సెంటర్లు ప్రారంభించినట్లు తెలిపారు. మిగిలిన కొనుగోలు సెంటర్లను కూడా వెంటనే ప్రారంభించి, కొనుగోలు పరిమితి పెంచాలని అన్నారు. ఇప్పటి వరకు 125 సెంటర్ల ద్వారా 23,131 మెట్రిక్ టన్నుల మక్కలను సేకరించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందకపోయినా, మార్కెట్లో రైతులకు మద్దతు ధర లభించకపోవడంతో, మక్క రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వమే మక్కలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. రూ. 2500 కోట్ల ఖర్చుతో మక్కలను కొనేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై సీసీఐ సీఎండీతో సంప్రదింపులు :
జిన్నింగ్ మిల్లర్ల సమస్యలు, పత్తి కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులపై సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాతో ఫోన్ ద్వారా వివరించారు. సీసీఐ అవలంబిస్తున్న ఎల్1, ఎల్2, ఎల్3 అలాట్‌మెంట్ విధానంతో కొనుగోళ్లు కొన్ని జిన్నింగ్ మిల్లులో మాత్రమే జరుగుతున్నదని, అనేక జిన్నింగ్ మిల్లులు మూతపడే పరిస్థితి ఉందని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందుల కారణంగా రైతులు, మిల్లు దారులు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించకుంటే ఈనెల 6న ప్రైవేట్, సీసీఐ పత్తి కొనుగోళ్లు నిరవధికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. రైతులు ఉత్పత్తి చేసిన పంటలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కనీస మద్దతు ధరకే కొనుగోలు చేపట్టాలని సూచించారు. అందుకోసం సీసీఐ ఎల్1, ఎల్2, ఎల్3 అలాట్‌మెంట్ ఎత్తివేసి, అన్ని నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లులలో కొనుగోళ్లను రెండు రోజుల్లో ప్రారంభించాలని కోరారు. దీనికి సీసీఐ సీఎండీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు ప్రక్రియలు సవ్యంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డికి సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా తేమశాతం 12 కు పైగా ఉంటుందని, దీనిని సీసీఐ వారు కొనకపోవడంతో, రైతులకు బహిరంగ మార్కెట్లో మంచి ధర రాకపోవడంతో నష్టపోతున్నారని మంత్రి అన్నారు. రైతులు సంవత్సరమంతా శ్రమించి పత్తి పండిస్తారు. కేవలం తేమ శాతం కారణంగా వారి పత్తి కొనకుండా వారిని ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. ఎకరాకు 7 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు పరిమితి నిబంధనను ఎత్తివేయడం అత్యవసరమని పేర్కొన్నారు. సీసీఐ కొత్త నిబంధనలు, జిన్నింగ్ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రులు బండి సంజయ్ , కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రైతులకు భూసార పరీక్ష పత్రాల పంపిణీ :
ప్రతి రైతు భూసార పరీక్ష చేయించుకోవడం వలన వారి భూములలో ఎంత శాతం పోషకాలు ఉన్నాయో తెలుస్తాయని, తద్వారా పంటల సాగుకు అనుకూలంగా ఎంత మోతాదులో ఎరువులు అవసరం అవుతుందో తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులకు భూసార పరీక్షల పత్రాలు పంపిణీ చేశారు. భూసార పరీక్షలను చేయించుకోవడం ద్వారా ఎరువుల వాడకం పై రైతులకు అవగాహన పెరిగి, ఎరువులపై రైతులు చేసే ఖర్చు తగ్గడమే కాకుండా భూమి ఆరోగ్యం కూడా కాపాడినట్లు అవుతుందన్నారు. ఈ సంవత్సరానికి జిల్లాకు ఒక మండలం చొప్పున 32 మండలాలకు చెందిన రైతులకు ఈ భూసార పరీక్ష పత్రాలను అందించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం 1,55,000 భూసార పరీక్ష పత్రాలను అందచేశామని, ఈ పత్రాలను ఉపయోగించుకొని 12 పారామీటర్స్ పైన మట్టి నమూనా పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. భూసార పరీక్ష పత్రాల ఫలితాల ద్వారా ఎరువులు వాడుకునే విధానం గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలియజేస్తారని అన్నారు. అదే విధంగా శాటిలైట్ టెక్నాలజీ తో మట్టి పరీక్షలు చేసే కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు, అవి ఇంకా ప్రయోగ దశల్లో ఉన్నట్లు, ఆ టెక్నాలజీ అందుబాటులోకి రాగానే ఇక్కడ కూడా అదే పద్ధతిలో రాష్ట్రమంతా ఒకేసారి మట్టి పరీక్షలు చేయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నీటి వసతి కలిగిన ప్రతి రైతు వరి, పత్తి పంటల బదులు ఆయిల్ పామ్ పంట సాగు చేపట్టాలన్నారు. ఈ పంటల ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చని, ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం మొక్కలు, డ్రిప్, అంతర పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తోంది, ఆయిల్ పామ్ లో అంతర పంటలుగా కోకో, మిరియాలు, వక్క, సాగు చేయడం వలన ఒకే భూమిలో ఎక్కువ రకాలైన పంటల సాగు చేసి, అధిక ఆదాయం పొందవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి, ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మి బాయి, వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు, రైతులు పాల్గొన్నారు






