Thummala: ఆ పంట సాగుతో కలెక్టర్ల కంటే రైతులకే ఎక్కువ ఆదాయం.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-05-05 08:00:46  IST  )

అధిక యూరియా వినియోగం వల్ల పంజాబ్ ప్రజల్లో క్యాన్సర్ ముప్పు పెరిగిందని మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు.

Thummala: ఆ పంట సాగుతో  కలెక్టర్ల కంటే రైతులకే ఎక్కువ ఆదాయం.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పురుగుల మందులు, యూరియా వాడకం పెరిగితే క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని వీటిని అధికంగా వాడకం వల్లే పంజాబ్ ప్రజల్లో క్యాన్సర్ ముప్పు పెరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. తల్లి బాగుంటేనే పిల్లలను పోషించుకుంటుంది. యూరియా అధికంగా వాడి మనల్ని పోషించే భూతల్లిని నాశనం చేయవద్దని రైతులను కోరారు. ఇవాళ వికారాబాద్ జిల్లా ధరూర్ లో 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పెస్టిసైడ్స్ వాడకం తగ్గించాలన్నారు. శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి వల్లే వ్యవసాయంలో దిగుబడి పెరిగిందని అయితే వారు ల్యాబ్ లలో చేస్తున్న ప్రయోగాల ఫలితాలు పొలాల్లోకి వచ్చేసరికి ఒక తరం పోతున్నదన్నారు.

కలెక్టర్ల కంటే ఎక్కువ ఆదాయం:

ఆయిల్ ఫామ్ సాగు (oil farm Cultivation) మీద రైతులు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. మంచి విత్తనాలు, మంచి మొక్కలు తెప్పిస్తున్నామని గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు మూడేళ్లలోనే అయిల్ ఫామ్ సాగులో దిగుబడి వస్తోందన్నారు. ఆలోపు అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రమంతటా ఆయిల్ ఫామ్ సాగుకు అనుమతి ఉందని రైతులు తమ అనుభవంతో పాటు శాస్త్రవేత్తలు చెప్పే విషయాలు కలగలిపి సాగులో ముందుకు వెళ్లాలన్నారు. కలెక్టర్లకు నెలకు లక్షరూపాయలే జీతం వస్తే ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఎకరానికి అన్ని ఖర్చులు పోను నెలకు రెండు లక్షల జీతం వచ్చినట్లు ఆదాయం వస్తుందన్నారు. వరి సాగులోనూ పాక్షికంగా ఆరుతడి విధానం పాటించాలన్నారు. వ్యవసాయంలో మరిన్ని మార్పులు రావాలన్నారు.

ఈ దేశంలో అలాంటి సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే:

గత ప్రభుత్వం పంటల బీమాను పట్టించుకోలేదని కానీ మా ప్రభుత్వం పంటల బీమాను మళ్లీ పునరుద్ధరించబోతున్నదని చెప్పారు. ఫసల్ బీమా లో కలుస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. పంటల బీమా ప్రీమియం అంశంపై త్వరలనే కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద ఆలోచనలే ఉన్నాయని అయితే రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగోలేదన్నారు. అయినా అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో మొదటి పంటకాలంలో రూ. 33 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఒక్కరేనన్నారు. గ్రామీణ తెలంగాణ అంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుందన్నారు.

Next Story