నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల

by Naga Rani Yarlagadda |

నర్మెట్టలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు.

నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల
X
  • నాణ్యమైన మొక్కలను రైతులకు అందించాలి
  • ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలి
  • ఆయిల్ ఫెడ్ అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల

దిశ, తెలంగాణ బ్యూరో : నర్మెట్టలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్​రెడ్డి చేతుల మీదుగా ఆ ఫ్యాక్టరీ ప్రారంభం కానున్న నేపథ్యంలో, సమయానికి అన్ని పనులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు. కల్లూరుగూడం, గద్వాల జిల్లా బీచుపల్లిలో జరుగుతున్న ఆయిల్ పామ్ మిల్లుల నిర్మాణ పనుల పురోగతి గురించి సమీక్షించి, కల్లూరు గూడం పనులను వచ్చే ఏడాది జూన్ కల్లా పూర్తి చేయాలని అన్నారు. బీచుపల్లి ఆయిల్ పామ్ కర్మాగార పనుల కోసం టెండర్లు వెంటనే పిలవాలన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ అనుకున్న స్థాయిలో జరగకపోవడం పట్ల అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖమ్మం, కొత్తగూడం జిల్లాలలో పురోగతి కొంతమేర ఉందని, భువనగిరి, నారాయణపేట, గద్వాల, జనగామ, సిద్దిపేట జిల్లాలలో చాలా తక్కువ స్థాయిలో ప్లాంటేషన్ జరిగిందని, లక్ష్యాన్ని పూర్తి చేయడానికి హార్టికల్చర్, సెరికల్చర్, అగ్రికల్చర్ శాఖల సిబ్బందిని వినియోగించుకోని, గ్రామాల వారీగా లక్ష్యాలను పెట్టుకొని, ప్లాంటేషన్ జరిగేలా చూడాలన్నారు. ఈ సంవత్సరంలోగా అన్ని కంపెనీలు కలిపి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 1.25 లక్షల ఎకరాలలో ప్లాంటేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. సెప్టెంబర్ నెలలో ప్లాంటేషన్ ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున రైతులకు అందించే ఆయిల్ పామ్ మొక్కలను నర్సరీలలోనే పర్యవేక్షించాలని సూచించారు. ఐఐఓపిఆర్ నిబంధనల ప్రకారం నర్సరీలు పెంచి, రైతులకు నాణ్యమైన మొక్కలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని, నర్సరీ స్థాయిలోనే కల్లింగ్ మొక్కలను నిర్మూలించాలని ఆయిల్ పామ్ మొక్కలకు కొరత లేకుండా చూసుకోవాలని, డిమాండ్ ప్రకారం మొక్కల నిల్వలు ఉండేలా చూసుకోవాలని అన్నారు. మలేషియాలో మాదిరి ఆయిల్ పామ్ గెలలను కోసేందుకు రైతులకు మలేషియా ఫైబర్ స్టిక్స్‌ను అమ్మకాలకు, కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా గడ్డిని తొలగించే యంత్రాలు (స్లాషర్స్), ఆయిల్ పామ్ కోత అనంతరం వచ్చే ఆకుల వ్యర్థాలను పొడిగా చేసే యంత్రాలు (స్రెడ్డర్స్) అద్దెకు ఇచ్చేట్టు రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

అంతర్ ​పంటలు వేసుకుంటే అదనపు ఆదాయం

ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌లో నిర్ధిష్ట దూరం పాటించినట్లయితే, మెకడమియా, కోకో, అరికనెట్ వంటి అంతర పంటలను వేసుకుంటే అదనపు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, అంతరపంటల యాజమాన్యం, సరైన సమయంలో పరపరాగ సంపర్కం కోసం ప్రతి తోటలో వీవిల్స్ ను వదిలేటట్టుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పండే ఆయిల్ పామ్ గెలలు అన్ని కూడా రాష్ట్రంలోని కర్మాగారాలలోనే ప్రాసెసింగ్ అయ్యేట్టు చర్యలు తీసుకోవాలి. ఆయిల్‌ఫెడ్ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని గత 10 సంవత్సరాలుగా జరిగిన ఖర్చులపై ఆడిట్ నిర్వహించి, ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. విజయ ఉత్పత్తులు కల్తీ లేకుండా, నాణ్యంగా ఉండాలని, కస్టమర్ల నమ్మకం పెంచే విధంగా పనిచేయాలని సూచించారు. దక్షిణ భారతదేశంలో విజయ ఉత్పత్తుల అమ్మకాలు విస్తరించేటట్లుగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో ఆటోమేటెడ్ విజయ ప్యాకింగ్ స్టేషన్ పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో అధిక విస్తీర్ణంలో ఆయిల్ పామ్ తోటలు గత 30 ఏళ్ల నుండి సాగుచేస్తున్నందున, వాటిలో వచ్చే పోషక లోపాలను విశ్లేషణ చేసేందుకు అప్పారావుపేటలో అదునాతన టెక్నాలజీతో Soil and Leaf Analysis Lab ఏర్పాటు చేసి రైతులకు సరైన ఎరువుల యాజమాన్యం కోసం, ఖర్చులను తగ్గించడం కోసం అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు , ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి, హార్టికల్చర్ సంచాలకులు యాస్మిన్ బాషా ఆయిల్ ఫెడ్, హార్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు.

Next Story