మొక్కజొన్న, జొన్న పంటలను పిఎస్ఎస్ పథకంలో చేర్చాలి: మంత్రి తుమ్మల

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో మొక్కజొన్న, జొన్న పంటలను పిఎస్ఎస్ పథకంలో చేర్చి, శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25శాతం కొనుగోలు పరిమితిని ఎత్తివేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు.

మొక్కజొన్న, జొన్న పంటలను పిఎస్ఎస్ పథకంలో చేర్చాలి: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మొక్కజొన్న, జొన్న పంటలను పిఎస్ఎస్ పథకంలో చేర్చి, శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25శాతం కొనుగోలు పరిమితిని ఎత్తివేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు. సోమవారం మరోసారి ఆయన లేఖ రాస్తూ రాష్ట్రంలో రైతుల సమస్యలు వివరించారు. మిగిలిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కోనుగోలు చేయడంతో ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్రల్ పూల్ లో కేంద్ర నోడల్ సంస్థ ద్వారా శనగ పంటను 29,860 మెట్రిక్ టన్నులు, పొద్దుతిరుగుడు కొనుగోలు పరిమితిని 3690 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి కేంద్రం అనుమతించిందని, పరిమితి ప్రకారం కొనుగోలు గత వారంలోనే పూర్తయ్యాయని అన్నారు. ఇంకా రైతుల వద్ద పంట మిగిలిఉందని, కొనుగోళ్ల కోసం మార్కెట్లకు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు.

కేంద్రం అనుమతించిన పరిమితులను ఇప్పటికే దాటినందున, శనగ పంటల కొనుగోలు పరిమతిని 1,12,077 మెట్రిక్ టన్నులకు పెంచాలని, పొద్దుతిరుగుడు పంటల కొనుగోళ్లను 10,839 మెట్రిక్ టన్నులకు పెంచాలని కోరారు. ఈ రబీ సీజన్ లో 11.21 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు చేయడం జరిగిందని, అనుకూల వాతావరణ పరిస్థితులతో ఈ సీజన్ లో ఎకరానికి 26.57 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని అన్నారు. జొన్న కూడా 3.68 లక్షల ఎకరాలలో సాగు చేస్తే ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్టు తెలిపారు. మార్కెట్లకు రైతులు తమ జొన్న పంటను తీసుకురావడం మొదలుపెట్టారని అన్నారు.

మార్కెట్లో గిట్టుబాటు ధర రానందున రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్ల కోసం 246 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రస్తుత రబీ సీజన్‌లో సుమారు 3.99 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. గత ఖరీఫ్ సీజన్‌లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3.76 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసి రూ.902.80 కోట్ల వ్యయం భరించిందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని ధర మద్దతు పథకంలో మొక్కజొన్న, జొన్న పంటలను చేర్చాలని అన్నారు. మొక్కజొన్న పంటను కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా 14.89 లక్షల మెట్రిక్ టన్నుల (1,48,99,520 క్వింటాళ్లు) కొనుగోలు చేసేందుకు, 2.76 లక్షల మెట్రిక్ టన్నుల (2,76,277 క్వింటాళ్లు) జొన్న పంటను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇది రైతులకు ఎంఎఎస్​పీ హామీ కల్పించి, తక్కువ ధరలకు అమ్మకాల పరిస్థితిని నివారించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.

Next Story