- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో 3.39 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలున్నాయ్: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో 3.39 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటివరకు 2.52 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 3.39 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటివరకు 2.52 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ యాప్‌కు రైతుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, 17.70 లక్షల మంది రైతులు యాప్ ద్వారా 59.78 లక్షల యూరియా బ్యాగులు బుక్ చేసుకున్నట్లు తెలిపారు. వీటిలో ఇప్పటికే 52.86 లక్షల బ్యాగులను రైతులు కొనుగోలు చేశారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని, పారదర్శకంగా యూరియాను అందించేందుకు రూపొందించిన యాప్‌కు రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ఎరువుల లభ్యతపై ఎలాంటి సందిగ్ధత లేకుండా ఉండేందుకు వ్యవసాయశాఖ ప్రతిరోజూ జిల్లాల వారీగా యూరియా నిల్వలు, అమ్మకాలు, కొనుగోలు, అందుబాటు తదితర వివరాలతో బులెటిన్లు విడుదల చేస్తోందన్నారు.
ఈ కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, ఒకే వ్యక్తి పలుమార్లు యూరియా కొనుగోలు చేయడం, ఎరువులను ఇతర ప్రాంతాలకు మళ్లించడం వంటి అక్రమాలకు గట్టి అడ్డుకట్ట పడిందని తెలిపారు. ఫెర్టిలైజర్ యాప్ అక్రమార్కులకు కొరకరాని కొయ్యగా మారిందన్నారు. ప్రతి యూరియా బ్యాగు కదలికపై ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోందని, ఏ డీలర్ దగ్గర ఎంత నిల్వ ఉంది, ఎంత విక్రయమైంది, ఎంత మిగిలి ఉందనే సమాచారం క్షణాల్లో అందుబాటులోకి వస్తోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 68 వేల మంది రైతులు యూరియాను బుక్ చేసుకున్నారని తెలిపారు. వారు 4.69 లక్షల యూరియా బ్యాగులు బుక్ చేసుకోగా 3.38 లక్షల బ్యాగులను కొనుగోలు చేశారని వెల్లడించారు. డిజిటల్ విధానాన్ని రైతులు ఎంత వేగంగా స్వీకరిస్తున్నారో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని అన్నారు.
శాటిలైట్ఆధారితగా మట్టి పరీక్షలకు ప్రయోగాలు :
శాటిలైట్ ఆధారిత మట్టి పరీక్షలపై ప్రస్తుతం వ్యవసాయశాఖ విస్తృత స్థాయిలో ప్రయోగాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా లభిస్తున్న సమాచారాన్ని వ్యవసాయశాఖ ప్రయోగశాలల్లో నిర్వహిస్తున్న మట్టి పరీక్షల నివేదికలతో ఎప్పటికప్పుడు సరిపోల్చుతూ ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తున్నామని చెప్పారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే రైతులకు తక్కువ సమయంలోనే భూసార వివరాలు, పోషక లోపాలు, అవసరమైన ఎరువులపై అత్యంత శాస్త్రీయమైన సూచనలు అందించగలమన్నారు. వ్యవసాయ రంగంలో మరిన్ని ఐటీ ఆధారిత ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. రైతులకు అవసరమైన అన్ని సేవలను ఒకే వేదికపై అందించే సమగ్ర డిజిటల్ వ్యవస్థలతో పాటు, పంటల పర్యవేక్షణ, భూసార నిర్వహణ, ఎరువుల పంపిణీ, వాతావరణ సమాచార సేవలు, వ్యవసాయ సలహాలను మరింత ఆధునికంగా అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.






