Thummala: చేనేత రుణాలపై మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

by Prasad Jukanti |

చేనేత జౌళిశాఖ రివ్యూలో మంత్రి తుమ్మల అధికారులకు పలు అంశాలపై కీలక ఆదేశాలు ఇచ్చారు.

Thummala: చేనేత రుణాలపై మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాల (Handloom Loans) వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేసి లబ్ధిదారుల ఖాతాలలో రుణమాఫీ నిధులు వెంటనే జమ చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ఆదేశించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పనీతీరుపై ఇవాళ హైదరాబాద్ లో చేనేత జౌళిశాఖ అధికారులతో తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పోరేషన్ల నుండి సంవత్సరానికి సంబంధించి వారికి అవసరమైన వస్త్రాల కోసం సెప్టెంబర్ నెలలోగానే ఆర్డర్లు తెప్పించుకోవాలి. ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వ శాఖలకు దుస్తుల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. టెస్కో షోరూంల పనితీరును మెరుగుపరిచి ఫలితాలు రాబట్టాలని స్వయం సహాయక సంఘాల మహిళలకు అందచేసే మహిళశక్తి చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలని పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ సంస్థలో మానవ వనరులను సక్రమంగా వినియోగించుకొని సంస్థను అభివృద్దిభాటలో నడిచేటట్టుగా చర్యలు తీసుకోవాలన్నారు. వేములవాడ నూలు డిపో ద్వారా నేత కార్మికులకు అవసరం మేరకు నూలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్ టీ)ని హైద్రాబాద్ నుండి యాదాద్రి జిల్లా పోచంపల్లిలో శాశ్వత ప్రాతిపదికన సంవత్సరంలోగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రుణమాఫీ కోసం 33 కోట్లు:

చేనేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీ కోసం 33 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5691 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందనున్నారని, త్వరలోనే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేసి, నిధులు విడుదల చేయబోతున్నట్లు వివరించారు. జౌళిశాఖలో అమలవుతున్న వివిధ పథకాలను గురించి ఈ సమీక్షలో మంత్రికి ఆమ వివరించారు. తెలంగాణ నేతన్న పొదుపు పథకంలో భాగంగా ఇప్పటి వరకు 33,913 మంది చేనేత కార్మికులు నమోదు చేసుకున్నారని, ఈ పథకంలో భాగంగా చేనేత కార్మికులు తమ వేతనంలో 8 శాతం మొత్తాన్ని బ్యాంకులలో జమచేస్తే ప్రభుత్వం 16 శాతం మొత్తాన్ని ఆర్డీ-11 ఖాతాలలో జమచేస్తుందని తెలిపారు. నేతన్న భద్రతలో భాగంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రమాదవశాత్తు గాని, సహజ మరణం పొందిన కార్మికుల నామినీలకు రూ.5 లక్షలు బీమా అందించినట్లు తెలిపారు. గతేడాది ఆగస్టు 14 నుంచి ఇప్పటివరకు మరణించిన 194 మంది చేనేత కార్మికుల నామినీలకు రూ.9.70 కోట్ల ప్రభుత్వ సాహాయం అందించి వారి కుటుంబాలను ఆదుకున్నట్లు వివరిచారు. తెలంగాణ నేతన్నకు భరోసా పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 48.8 కోట్లు కేటాయించామని నేత కార్మికుల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

చేనేత పురస్కార గ్రహితలకు మంత్రి సన్మానం:

భారత ప్రభుత్వం చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారం -2024 కు ఎంపికైన వారిని మంత్రి తుమ్మల సన్మానించారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన గజం నర్మద, గూడ పవన్ ను శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జాతీయ చేనేత అవార్డుకు ఎంపికయి చేనేత రంగంలో ఆదర్శంగా నిలిచి తెలంగాణ రాష్ట్రానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తేవడం గర్వకారణమన్నారు. దేశవ్యాప్తంగా 19 మంది చేనేత కార్మికులు ఎంపిక కాగా అందులో మన తెలంగాణ నుంచి ఇద్దరికి పురస్కారాలు రావడం అభినందనీయం అన్నారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చేయూతనిస్తుందని, చేనేత కార్మికుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరగడం కోసం ప్రత్యేక లేబుల్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Next Story