వరి సాగుపై పునరాలోచించండి.. రైతులకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి

by Ramesh Naini |

రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున రైతులు వరి సాగుపై పునరాలోచించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

వరి సాగుపై పునరాలోచించండి.. రైతులకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున రైతులు వరి సాగుపై పునరాలోచించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. రానున్న నెలల్లో కూడా ఎల్-నినో ప్రభావం తీవ్రమయ్యే సూచనలు ఉన్నాయన్నారు. జిల్లాల వారీగా అందిన సూచనలతో సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయనున్నట్లు తెలిపారు. గురువారం సచివాలయంలో ఎక్స్‌పర్ట్ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి, ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రత్యామ్నాయ పంటలు వేయండి..

ప్రస్తుతం రాష్ట్రంలోని 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని, నీటి నిల్వలు తాగునీటికే ప్రాధాన్యంగా ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. బోరుబావుల కింద కూడా వరి వేయకుండా పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటలు సాగు చేసేలా గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద వర్షపు నీటి నిల్వ నిర్మాణాలు, చెరువుల పూడికతీత, ఫార్మ్ పాండ్లు, చెక్ డ్యామ్‌ల నిర్మాణ పనులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

బ్యాంకు రుణాలు పెంచాలి..

వ్యవసాయ అనుబంధ రంగాలకు, మైక్రో ఇరిగేషన్ (డ్రిప్/స్ప్రింక్లర్లు) కోసం రైతులకు ఇచ్చే రుణ కేటాయింపులను పెంచాలని బ్యాంకులు, నాబార్డ్‌ను మంత్రి తుమ్మల కోరారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను ముందుగానే సిద్ధం చేయాలని, అవసరమైతే రైతు వేదికలను విత్తన పంపిణీ కేంద్రాలుగా మార్చాలని సూచించారు. నేషనల్ సీడ్ కార్పొరేషన్ ద్వారా విత్తనాలపై 50 శాతం సబ్సిడీ ఇచ్చేలా కేంద్రంతో చర్చించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే పరిస్థితుల నుంచి రైతులను కాపాడేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, క్షేత్రస్థాయిలో నిరంతరం వాతావరణ, జలాశయాల సమాచారాన్ని అందించాలని మంత్రి తుమ్మల సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 24 శాతం లోటు వర్షపాతం నమోదైందని, సాధారణ సాగుతో పోలిస్తే దాదాపు 32 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు.

Next Story