వచ్చే ఎన్నికల్లో మంత్రి తలసాని గెలుపు కష్టమే!

by GSrikanth |
వచ్చే ఎన్నికల్లో మంత్రి తలసాని గెలుపు కష్టమే!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు నియోజకవర్గంలో ఎదురు గాలి వీస్తున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు అంత సులువేం కాదు. ఇప్పుడు గ్రేటర్ అంతటా వినిపిస్తున్న టాక్ ఇదే. రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నా సొంతింట్లో ప్రజాభిమానాన్ని కోల్పోయారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సనత్ నగర్ సెగ్మెంట్‌లో నామినేటెడ్, పార్టీ పదవులు వస్తాయని ద్వితీయ శ్రేణి నేతలు ఆశపడ్డారు. వారికి పదవులు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికితోడు 2018 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి తలసాని చేతిలో ఓటమి పాలైన కూన వెంకటేశ్ గౌడ్ అనంతరం టీఆర్ఎస్‌లో చేరారు.

ఆయనకు కూడా నామినేటెడ్ పోస్టు వస్తుందని భావించారు. ఎలాంటి పదవి దక్కకుండా మంత్రి తలసాని అడ్డుకున్నారని, దీంతోనే ఆయన తిరిగి ఇటీవల సొంతగూటికి చేరారు. అంతేకాకుండా 2014లో ఇదే నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలైన దండె విఠల్‌ను రాజకీయంగా ఎదగనీయలేదని, ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకోవడంతో ఆదిలాబాద్‌కు మారాల్సి వచ్చిందనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు మంత్రికి సన్నిహితంగా ఉన్నవారిని కూడా పక్కన పెట్టడంతో వారు ఆయన పట్ల వ్యతిరేకతతో ఉన్నారని సమాచారం. ఇలా కర్ణుడి చావుకు కారణాలు అనేకం ఉన్నట్టే తలసాని హ్యాట్రిక్ కొట్టకుండా అనేక అంశాలు అడ్డుపడుతున్నాయనేది హాట్ టాపిక్‌గా మారింది.

పెరుగుతున్న ‘కమలం’ పరపతి

2019లో పార్లమెంట్ ఎన్నికల్లో తలసాని తన కొడుకును సికింద్రాబాద్ నుంచి బరిలోకి దించినా గెలిపించుకోలేకపోయారు. మంత్రి సొంత సెగ్మెంట్ సనత్‌నగర్‌లో కూడా బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి అత్యధిక మెజార్టీ సాధించడంతో మంత్రిపై వ్యతిరేకత బహిర్గతమైంది. దీనికితోడు 2020లో బల్దియా ఎన్నికల్లోనూ ఆయనకు కంచుకోటగా ఉన్న మోండా మార్కెట్, రాంగోపాల్ పేట, అమీర్‌పేట్ డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు గెలుపొందారు. మొత్తంగా తలసాని నియోజకవర్గంలో చాపకింద నీరులా బీజేపీ బలం పెంచుకునేందుకు పావులు కదుపుతుండటంతో సనత్‌నగర్​రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి.

Also Read..

గొల్లకుర్మలకు తీపికబురు.. గొర్రెల పంపిణీ డేట్ ఫిక్స్

Advertisement

Next Story