రెండేళ్ల ప్రజా పాలనకు ప్రజల ఆమోద ముద్ర.. మున్సిపల్ ఫలితాలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందన

by Ramesh Naini |

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనకు ప్రజల ఆమోద ముద్ర అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు.

రెండేళ్ల ప్రజా పాలనకు ప్రజల ఆమోద ముద్ర.. మున్సిపల్ ఫలితాలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందన
X

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనకు ప్రజల ఆమోద ముద్ర అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు. ఇది కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై ఉన్న తిరుగులేని విశ్వాసానికి నిదర్శనమని శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. తమ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయడమే అజెండాగా పెట్టుకున్న శక్తులకు ఈ ప్రజా తీర్పు ఓ చెంప దెబ్బ అని వెల్లడించారు.

ఓ వైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే, మరోవైపు అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల చెంతకు చేర్చాలన్న మా ప్రభుత్వ సంకల్పానికి ఈ ఫలితాలు నిదర్శనమని శ్రీధర్ బాబు అన్నారు. ఈ గెలుపు ప్రభుత్వంపై బాధ్యతను మరింత పెంచిందని, ఈ స్ఫూర్తితో తెలంగాణను అన్ని రంగాల్లోనూ ఇతర రాష్ట్రాలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేసి తీరుతామని, అబద్ధపు ప్రచారాలను నమ్మకుండా, అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలకు, ఈ ఎన్నికల్లో విజయం కోసం ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మార్గ నిర్దేశనంలో, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నాయకత్వంలో అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మంత్రి శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు.

Next Story