- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్యూబాతో సంబంధాలు పెంపొందించుకునేందుకు మేం సిద్ధం: శ్రీధర్ బాబు
హైదరాబాద్‌ను గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ(ఫిన్ టెక్)కి అత్యంత కీలకమైన గ్లోబల్ కమాండ్ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ను గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ(ఫిన్ టెక్)కి అత్యంత కీలకమైన గ్లోబల్ కమాండ్ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. మంగళవారం రాయదుర్గంలో అంతర్జాతీయ దిగ్గజ ఫైనాన్షియల్ మార్కెట్ సంస్థ డాయిష్ బోర్స్ గ్రూప్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్(జీసీసీ)ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పిల్లర్‌గా ఉన్న డాయిష్ బోర్స్ గ్రూప్ హైదరాబాద్‌ను ఎంచుకోవడం రాష్ట్ర ప్రభుత్వ పటిష్టమైన పాలసీలు, స్థిరత్వం, ఇక్కడి టాలెంట్ పూల్‌పై గ్లోబల్ కంపెనీలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ప్రపంచంలోని టాప్ టెన్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలలో ఏడు ఇక్కడ నిర్వహిస్తుండటం మనకు గర్వకారణమన్నారు. డాయిష్ బోర్స్ రాకతో హైదరాబాద్ గ్లోబల్ క్యాపిటల్, సంపదకు శక్తినిచ్చే కేంద్రంగా అంతర్జాతీయ యవనికపై మరోసారి నిరూపించుకుందన్నారు.
నగరాన్ని కేవలం ఇంక్యుబేషన్ హబ్‌గా మాత్రమే కాకుండా గ్లోబల్ ఆవిష్కరణ పవర్‌హౌస్‌గా మార్చేలా ఒక ప్రత్యేక గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. ఈ హబ్ రీసెర్చ్, బ్రేక్‌త్రూ ఐడియాలకు ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం పెట్టుబడులను ఆకర్షించడంపైనే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చే వాల్యూను సృష్టించేందుకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ జీసీసీ షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ వంటి ప్రధాన ఎక్స్ఛేంజీలతో సహా 24 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆస్తులను నిర్వహించే గ్లోబల్ మార్కెట్లకు అత్యున్నత సేవలు అందిస్తుందన్నారు. తొలిదశలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇంజినీరింగ్ వంటి డీప్ టెక్నాలజీ రంగాల్లో 1,000 మందికి హై స్కిల్డ్ ఉద్యోగాలు లభిస్తాయన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య రెండింతలు అవుతుందన్నారు. కార్యక్రమంలో జర్మనీఅంటూ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్, స్పెషల్ సీఎస్ సంజయ్‌కుమార్, డాయిష్ బోర్స్ సీఐవో/ సీవోవో డాక్టర్ క్రిస్టోఫ్ బోమ్, డైరెక్టర్ డాక్టర్ లుడ్విగ్ హీన్సెల్‌మన్ తదితరులు పాల్గొన్నారు.
నైపుణ్య మార్పిడితో ఉమ్మడి పురోగతికి అడుగులేద్దాం..
ద్వైపాక్షిక సహకారం ద్వారా నైపుణ్యాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకొని ఉమ్మడి పురోగతి వైపు కలిసి అడుగేద్దామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ‘తెలంగాణ - క్యూబా’ మధ్య సత్సంబంధాలను పెంపొందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ అగులేరా, ఫస్ట్ సెక్రటరీ మిక్కీ డియాజ్ పెరెజ్‌తో మంగళవారం ఆయన సచివాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బయో టెక్నాలజీ, ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ, ఏఐ, ఇన్నోవేషన్, అగ్రికల్చర్, సస్టైనబుల్ ఫార్మింగ్, స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్, కల్చర్ తదితర అంశాల్లో ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడికి గల అవకాశాలపై చర్చించారు. టీ-హబ్, టీ-వర్క్స్, వీ-హబ్ ద్వారా క్యూబా స్టార్టప్స్‌కు మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. ప్రపంచంలోని టాప్- 7 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘జీనోమ్ వ్యాలీ’ని సందర్శించాలని క్యూబా ప్రతినిధులను ఆహ్వానించారు. బాక్సింగ్, అథ్లెటిక్స్‌లో క్యూబా నైపుణ్యాన్ని తెలంగాణకు అందించాలని కోరారు. నూతన ఆవిష్కరణలు, ఇన్నోవేషన్ డ్రివెన్ ప్రోగ్రెసివ్ విధానాలను అవలంబిస్తున్న తెలంగాణలాంటి రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ అగులేరా పేర్కొన్నారు.






