మంత్రి శ్రీధర్‌బాబు మెట్రో జర్నీ.. ప్రయాణికులతో ముచ్చట

by Gantepaka Srikanth |

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం మెట్రో జర్నీ చేశారు.

మంత్రి శ్రీధర్‌బాబు మెట్రో జర్నీ.. ప్రయాణికులతో ముచ్చట
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం మెట్రో జర్నీ చేశారు. సాధారణ ప్రయాణికుడిలా టికెట్ కొనుగోలు చేసి.. తూర్పున ఉన్న నాగోల్ స్టేషన్ నుండి పశ్చిమాన ఉన్న ఐటీ కారిడార్ రాయదుర్గం వరకు ప్రయాణించారు. మెట్రో సేవలు, సౌకర్యాలు, స్టేషన్లలో భద్రత, రవాణా సవాళ్లు, ట్రాఫిక్ తదితర అంశాలపై ప్రయాణికులతో ముచ్చటించారు. మెట్రో అనుభవాలను స్వయంగా తెలుసుకునేందుకు మెట్రో రైలులో ఆకస్మికంగా ప్రయాణించారు. ప్రజలకు మెరుగైన, వేగవంతమైన రవాణాను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి ప్రయాణికులకు వివరించారు. నగరంలో ప్రజారవాణా బలోపేతానికి ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలు, మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఆర్ఆర్ఆర్, ఇతర భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. సలహాలు, సూచనలు స్వీకరించారు. ఇది ప్రజా ప్రభుత్వమని.. ప్రశంసలను తీసుకుంటున్నట్లుగానే విమర్శలనూ స్వీకరిస్తామని చెప్పారు. భవిష్యత్తు తరాల కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి అండగా నిలవాలని, రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. కాగా.. మెట్రోను ప్రభుత్వం అధీనంలోకి తీసుకున్న మూడు రోజుల్లోనే మంత్రి మెట్రో జర్నీ చేయడం ఆసక్తికరంగా మారింది.

Next Story