డీప్-టెక్, ఏఐ స్టార్టప్‌లలో పెట్టుబడులు.. యూఏఈ ప్రభుత్వాన్ని కోరిన మంత్రి శ్రీధర్ బాబు

by Ramesh Naini |

రాష్ట్రాన్ని గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్ హబ్‌ గా మార్చాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని, ఈ లక్ష్య సాధనలో యూఏఈ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వానించారు.

డీప్-టెక్, ఏఐ స్టార్టప్‌లలో పెట్టుబడులు.. యూఏఈ ప్రభుత్వాన్ని కోరిన మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రాన్ని గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్ హబ్‌ గా మార్చాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని, ఈ లక్ష్య సాధనలో యూఏఈ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ఆహ్వానించారు. యూఏఈ పర్యటనలో భాగంగా గురువారం ఆ దేశ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఏఐ, డిజిటల్ ఎకానమీ అండ్ రిమోట్ వర్క్ అప్లికేషన్స్ ఓమర్ బిన్ సుల్తాన్ అల్ ఓలామాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత ‘తెలంగాణ డేటా ఎక్స్ ఛేంజ్ తో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ప్రభుత్వ పాలన తదితర రంగాల్లో కలుగుతున్న ప్రయోజనాలను వివరించారు. హైదరాబాద్ లో తెలంగాణ భాగస్వామ్యంతో ‘ఏఐ’ ఆర్అండ్ డీ సెంటర్ ను ప్రారంభించేందుకు ముందుకు రావాలని కోరారు. తెలంగాణ భారతదేశంలో నాలుగో అతిపెద్ద యూఏఐ ఆర్థిక వ్యవస్థగా ఉంది. జూలై 2025 నాటికి రూ.1.26 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. చెల్లింపులు, బ్లాక్‌చెయిన్, డిజిటల్ వాణిజ్యంలో కొత్త ఆవిష్కరణలకు ఫిన్‌టెక్ శాండ్‌బాక్స్ అందుబాటులో ఉందన్నారు. యూఏఈ డిజిటల్ ఆర్థిక సంస్థలకు భారత్ లో ప్రవేశ కేంద్రంగా హైదరాబాద్‌ అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని వివరించారు.

తెలంగాణ–యూఏఈ ఫ్యూచర్ స్కిల్స్ అకాడమీ :

డీప్-టెక్, ఏఐ స్టార్టప్ లలో పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ సావరిన్ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ సంస్థలకు మంచి అవకాశాలు ఉన్నాయని సూచించారు. ‘ఏఐ, స్టార్టప్ సమ్మిట్’ను యూఏఈతో కలిసి నిర్వహించేందుకు తెలంగాణ ఆసక్తిగా ఉందని, ఇందుకు సహకరించాలని కోరారు. స్మార్ట్ మొబిలిటీ, లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ, గృహ నిర్మాణం, ఇ-గవర్నెన్స్‌ తదితర రంగాల్లో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ సంస్థలు మంచి అవకాశాలున్నాయని చెప్పారు. గేమింగ్‌లో ‘తెలంగాణ–యూఏఈ ఫ్యూచర్ స్కిల్స్ అకాడమీ’ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలన్నారు.

స్టార్ గేట్ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలి : యూఏఐ మంత్రి ఓమర్ బిన్ సుల్తాన్ అల్ ఓలామా

తెలంగాణను ‘గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్’ హబ్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను యూఏఐ మంత్రి ఓమర్ బిన్ సుల్తాన్ అల్ ఓలామా ప్రశంసించారు. ఏఐ, డిజిటల్ ఎకానమీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, గేమింగ్‌ తదితర రంగాల్లో తెలంగాణతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 100 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో యూఏఈ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఏఐ ఆధారిత ‘స్టార్ గేట్’ ప్రాజెక్టు గురించి మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణ కీలక భాగస్వామిగా మారాలని ఆకాంక్షించారు. త్వరలో యూఏఐలో నిర్వహించనున్న ‘ఫిన్ టెక్ స్టార్టప్స్’ సమ్మిట్ లో తెలంగాణ కంపెనీలను కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పారు.

Next Story