- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్‌డెస్క్: సౌదీ అరేబియాలో సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనలో పలువురు హైదరాబాద్ వాసులు మరణించారు. దీంతో హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లినవారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమవారు యాత్రకు వెళ్లిన ట్రావెల్స్ ఏజెన్సీ వద్దకు కుటుంబ సభ్యులు చేరుకుని తమవారి ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సౌదీలో కాన్సులేట్ వాళ్లతో సంప్రదిస్తున్నామని తెలిపారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
హైదరాబాద్ లో ఉమ్రా యాత్రకు ప్రయాణికులను పంపే ఏజెన్సీలతో పోలీసులు మాట్లాడుతున్నారని, ఉమ్రా యాత్రకు వెళ్లిన వారి పూర్తి సమాచారం తెలుసుకుంటున్నామని తెలిపారు. జెడ్డాలోని కాన్సులేట్ జనరల్, రియాద్ లోని డిప్యూటీ అంబాసిడర్ తో మాట్లాడి ప్రమాదంలో మరణించిన యాత్రికుల వివరాలను తెలుసుకుంటున్నామన్నారు. ఈ ఘటనపై సహాయక చర్యలను పర్యవేక్షించే బాధ్యతలను ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ కు అప్పగించినట్లు తెలిపారు. హైదరాబాద్ మల్లేపల్లిలోని అల్ మీనా ట్రావెల్స్ ద్వారా 16 మంది, ఫ్లైజోన్ ట్రావెల్స్ ద్వారా 24 మంది టికెట్స్ బుకింగ్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. మరో ఇద్దరు వేరే ఏజెన్సీ ద్వారా వెళ్లినట్లు తెలిపారు. ప్రమాదంలో 42 మంది చనిపోగా.. హైదరాబాద్ నుంచి కూడా 42 మంది యాత్రికులు వెళ్లినట్లు ట్రావెల్ హిస్టరీ చెబుతోంది. దీంతో అక్కడ చనిపోయిన 42 మందీ హైదరాబాద్ కు చెందిన వారేనా? అని బాధిత కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు.






