Sridhar Babu: ప్రతిభ ఉన్నవారికి ఆర్థిక ఇబ్బందులు అడ్డుకావద్దు

by Gantepaka Srikanth |

రాష్ట్రం పరిశ్రమలు, ఆవిష్కరణల రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యా రంగాన్ని బలోపేతం చేయడం అత్యంత అవసరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

Sridhar Babu: ప్రతిభ ఉన్నవారికి ఆర్థిక ఇబ్బందులు అడ్డుకావద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం పరిశ్రమలు, ఆవిష్కరణల రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యా రంగాన్ని బలోపేతం చేయడం అత్యంత అవసరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎస్ఆర్ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదని.. మలబార్ వంటి సంస్థలు ముందుకొచ్చి స్కాలర్‌షిప్‌లు అందించడం ద్వారా సమాజంలో సమాన అవకాశాలు కల్పించబడతాయని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తాయని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన 5,050 మంది విద్యార్థులకు రూ.4.55 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌లు అందజేయడం గొప్ప విషయమని కొనియాడారు. మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపి అహ్మద్ మాట్లాడుతూ వ్యక్తిగత, సామాజిక స్థాయిలో దీర్ఘకాలిక ప్రభావాన్ని సృష్టించడానికి విద్య అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటిగా నిలుస్తుందన్నారు.

దేశవ్యాప్తంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ సీఎస్ఆర్ కార్యక్రమాలు 20 రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయని.. ఈ ఏడాది రెండు లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు తెలిపారు. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో సంస్థ చేపట్టిన కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు 18 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరిందని వెల్లడించారు. విద్యా రంగంలో భాగంగా దేశవ్యాప్తంగా 33,000 మంది బాలికలకు ఈ ఏడాది స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే 17 రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 1,543 మైక్రో లెర్నింగ్ సెంటర్ల ద్వారా పేద విద్యార్థులకు విద్యా సహాయం అందిస్తున్నామని.. వీటిని త్వరలో 2,500 కేంద్రాలకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆషర్ ఓ, రిటైల్ హెడ్ సిరాజ్ పీకే, జోనల్ హెడ్ షరీజ్ కె తదితరులు పాల్గొన్నారు.

Next Story