- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరుకు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ.. మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్రంలో చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారాలు సూచించేందుకు ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారాలు సూచించేందుకు ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ప్రకటించారు. శనివారం సచివాలయంలో చెరుకు రైతులు, పరిశ్రమల ప్రతినిధులు, చెరుకు అభివృద్ధి మండలి ఛైర్మన్లతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో ఏటా చెరుకు సాగు విస్తీర్ణం తగ్గుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, రాష్ట్రంలోని చక్కెర పరిశ్రమల సమస్యలు కూడా పరిష్కరించాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని తెలిపారు. అందరితో చర్చించి నివేదిక రూపొందించేందుకు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించనున్నట్లు వెల్లడించారు. ఇందులో సంబంధిత శాఖల అధికారులు, చక్కెర పరిశ్రమల ప్రతినిధులు కూడా ఉంటారని చెప్పారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో చెరుకు రైతులకు అందిస్తున్న ప్రయోజనాలు, రాయితీలపై అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరలో నివేదిక అందిస్తుందన్నారు.
ప్రతి క్వింటాలు సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.500 బోనస్ ను చెరుకు పంటకు కూడా వర్తింప చేయాలని రైతులు కోరుతున్న విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. చెరుకు హార్వెస్టర్ యంత్రాలపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 50 శాతం సబ్సిడీని ఇవ్వగా ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రాయితీని తొలగించిన విషయం కూడా వివరిస్తాను. కూలీల సమస్యతో చెరుకు నరకడం రైతులకు సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం మంథనిలో పత్తి తీసే కూలీల కొరత వల్ల ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి లేబర్ వస్తున్నారని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ రాయితీని చెరుకు పంటకు కొనసాగించాలని రైతులు కోరుతున్న విషయంపై కూడా అధికారుల కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు. డ్రిప్ పరికరాలతో ఎకరానికి 8 నుంచి 9 టన్నుల దిగుబడి పెరుగుతుందని అధికారులు చెప్పారన్నారు.
చెరుకు రవాణా ఛార్జీలను కొంత మేరకు భరించే అంశాన్ని కూడా కమిటీ అధ్యయనం చేస్తుంది, తెలంగాణలో ప్రైవేటు రంగ చక్కెర పరిశ్రమలను కాపాడుకుంటామని తెలిపారు. నిజాం షుగర్స్ పునరుద్ధరణ విషయంలో వారి అనుభవాన్ని వినియోగించుకుంటామని, కార్మికులు, రైతుల శ్రేయస్సుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని వివరించారు. ఏపీలో చక్కెర రికవరీ శాతం 9 శాతం ఉండగా, రాష్ట్రంలో 11 శాతం వరకు వస్తుండటం సంతోషం కలిగించే అంశమన్నారు. ఈ సమావేశంలో తెలంగాణా పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, చక్కెర పరిశ్రమల డైరెక్టర్ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






